‘ధూప దీపం’కు దూరం..!
దరఖాస్తులు ఎక్కువ.. మంజూరు తక్కువ ఉమ్మడి జిల్లాలో డీడీఎన్ పథకంలో 21 ఆలయాలు మంజూరు మంచిర్యాల జిల్లాలో ఒక్క గుడికే చోటు
చేసినవి
మంచిర్యాలఅర్బన్: ఆదాయం తక్కువగా ఉన్న ఆలయాల్లో నిత్యం ధూప దీప నైవేద్య పూజలు కొనసాగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ధూప దీప నైవేద్యం(డీడీఎన్) పథకంలో ఉమ్మడి జిల్లాకు శఠగోపం పెట్టింది. వందల సంఖ్యలో దరఖాస్తులు రాగా ఆలయాల ఎంపిక మాత్రం రెండు పదులకు పరిమితం కావడం నిరాశకు గురిచేస్తోంది. మంచిర్యాల జిల్లాలో ఒకే ఆలయానికి చోటు దక్కడంపై పెదవి విరుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఐదు, కుమురంభీం ఆసిఫాబాద్‌లో రెండు,నిర్మల్ జిల్లాలో 13 ఆలయాలు మజూరయ్యాయి.
ఆలయాలకు దక్కని చోటు
డీడీఎన్ పథకం కింద ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 726 దరఖాస్తులు వచ్చాయి. పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ అనంతరం 146 ఆలయాలు ఎంపిక చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. ఇందులో 21 ఆలయాలు మాత్రమే ఈ పథకం కింద మంజూరుయ్యాయి. ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే ఉమ్మడి జిల్లాకు మొండి చేయి చూపినట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల ప్రజాప్రతినిధుల పైరవీలు, ఒత్తిడితో ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి ప్రజాప్రతినిధుల ఉదాసీనతతో ఆశించిన మేర ఆలయాలకు చోటు దక్కలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిబంధనలు ఇలా..
ఈ పథకం కింద ఆలయాలు ఎంపిక కావాలంటే దేవాదాయ శాఖలో నమోదై నిత్య పూజలు నిర్వహిస్తుండాలి. జాతర సందర్భాల్లో తెరిచే ఆలయాలకు పథకం వర్తించదు. ఆలయానికి ఆదాయం వచ్చే ఎలాంటి భూములు ఉండకూడదు. ఆలయంలో ఒక అర్చకుడికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఒకే ప్రాంగణంలో ఉన్న ఉప ఆలయాలకు వర్తించదు. రాష్ట్రంలో 2007లో తీసుకొచ్చిన ఈ పథకం కింద ఒక్కో గుడికి రూ.2,500 చెల్లించేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచారు. పూజ సామగ్రికి రూ.4వేలు, అర్చకుడికి రూ.6వేలు గౌరవ వేతనంగా చెల్లిస్తున్నారు. దరఖాస్తుల వడపోత అనంతరం ప్రత్యేక కమిటీ వందల సంఖ్యలో ఎంపిక చేసి నివేదించినా మంజూరు మూడు పదులకై నా చేరకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరిన్ని ఆలయాలకు మంజూరు అవకాశం కల్పించేలా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.
జిల్లా దరఖాస్తులు ఎంపిక మంజూరు
ఆదిలాబాద్ 219 34 05
కుమురంభీం 102 18 02
మంచిర్యాల 110 34 01
నిర్మల్ 295 60 13
726 146 21


