
కళ్లు కనిపించకపోయినా..
కుంటాల: జీవితంలో ఏదైనా సాధించాలన్న తపన.. సమాజంలో ఏదో ఒకటి సాధించాలన్న లక్ష్యం వారిలో ఉంటుంది. కళ్లు లేకపోయినా తబలా, హార్మోనియం వాయిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. సంకల్పానికి అంగవైకల్యం అడ్డురాదని నిరూపిస్తున్నారు కుంటాల మండలం అంబకంటి గ్రామ వాసి రిటైర్డ్ ఉపాధ్యాయుడు గోపు పాపయ్య.
విద్యార్థి దశ నుంచే..
గజ్జవ్వ–గజ్జన్నల దంపతుల కుమారుడు పాపయ్య. సుమారు మూడేళ్ల వయస్సులో పోచమ్మ (అమ్మవారు) సోకడంతో రెండు కళ్లు కోల్పోయాడు. గ్రామానికి చెందిన దివంగత పోతన్‌రావు సహకారంతో హైదరాబాద్ వెళ్లాడు. పాతబస్తీ సాలార్జంగ్ మ్యూజియం బసంత హవేలీ అంధుల పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యనభ్యసించాడు. బ్రెయిలీ విధానం ద్వారా విద్య నేర్చుకున్నాడు. పాఠశాలలో సంగీతం, ఆటలు, వ్యాయామం తరగతులు నిర్వహించేవారు. శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకున్న పాపయ్య తబలా, హార్మోనియం వాయించడంలో ప్రావీణ్యం పొందాడు. చంచల్‌గూడ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. బిస్కెట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ డిగ్రీ చదువుకునే సమయంలో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుడిగా 1985లో టీటీసీలో అర్హత సాధించాడు.
తనదైన శైలిలో బోధన
అంధుల పాఠశాలలో బ్రెయిలీ లిపి నేర్చుకుని పాపయ్య టీచర్‌గా 37 ఏళ్లపాటు విద్యాబోధన అందించారు. విద్యార్థులకు భాష, ఉచ్చరణ, పరిజ్ఞానం పెంపొందించాలన్న లక్ష్యంతో తనదైన శైలిలో బోధనకు రూపకల్పన చేశాడు. పాఠ్యాంశాల్లోని వరుసలను విద్యార్థులతో చదివించేవాడు. అదివిన్న తర్వాత వారికి అర్థమయ్యేలా బోధించడం ద్వారా ప్రత్యేకత చాటుకున్నారు.
ఇంపైన సంగీతం
తనకు కళ్లు లేకపోయినా..తను నేర్చుకున్న కళలతో ఇతరులకు ఇంపైన సంగీతాన్ని అందిస్తున్నారు. పాపయ్య తన స్నేహితులతో కలిసినప్పుడు, ఇంట్లో జరిగే శుభకార్యాలలో తబలా, హార్మోనియం వాయించడంతో అది విని, చూసిన పలువురు మంత్ర ముగ్ధులవుతున్నారు. బహుముఖ ప్రజ్ఞశాలిగా తనకంటూ ప్రత్యేకత చాటుతూ ముందుకు సాగుతున్న పాపయ్యను పలువురు అభినందిస్తున్నారు.
లక్ష్యంతో ముందుకెళ్లాలి
ఉపాధ్యాయుడిగా వి ద్యార్థులకు బోధన చే యడం సంతృప్తినిచ్చింది. జీవితంలో సాధించా లన్న లక్ష్యంతో ముందుకెళ్లాలి. తబలా, హార్మోనియం చక్కగా వాయించడంతో అందరూ అభినందించడం సంతోషంగా ఉంది. – గోపు పాపయ్య,
రిటైర్డ్ ఉపాధ్యాయుడు, అంబకంటి
సంగీత వాయిద్యంలో దిట్ట
రాణిస్తున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు పాపయ్య

కళ్లు కనిపించకపోయినా..

కళ్లు కనిపించకపోయినా..