ఆటో ఢీకొని వ్యక్తి మృతి
రంగంపేట: ఈలకొలను గ్రామంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై ఎస్.శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈలకొలను గ్రామానికి చెందిన కేతా శ్రీనివాస్ (39) తన మోటార్ సైకిల్‌పై అదే గ్రామానికి చెందిన కురుకూరి ముత్యాలును ఎక్కించుకుని రాజానగరం మండలం తోకాడ గ్రామానికి పనికి వెళ్లాడు. అయితే అక్కడ పని లేదని.. ఈలకొలను గ్రామంలోనే పని ఉందని మేస్త్రి చెప్పడంతో తిరుగు ప్రయాణమయ్యారు. ఈలకొలనులో బత్తిన నాగన్నకు చెందిన జీడిమామిడి తోట వద్దకు వచ్చే సరికి ఎదురుగా అతి వేగంగా ఆటో వచ్చి వారిని ఢీకొంది. ఈ ఘటనలో శ్రీనివాస్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ముత్యాలు స్పల్పంగా గాయపడ్డాడు. మృతుడి సోదరుడు కేతా రాంబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వ్యాన్ ఢీకొని యువకుడు..
నిడదవోలు రూరల్: వ్యాన్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై వెళుతున్న యువకుడు మృతి చెందాడు. సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట శివారు వెంకట్రావుపాలెం గ్రామానికి చెందిన కుండా ఆనంద్ కుమార్ (22) రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి ఆసుపత్రికి బైక్‌పై బయలు దేరిన అతడిని గోపవరం గుబ్బాలమ్మ గుడి వద్ద ఎదురుగా పైపుల లోడ్‌తో వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆనంద్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చోరీ కేసులో ముగ్గురికి జైలు
జగ్గంపేట: బంగారం చోరీ కేసులో ముగ్గురికి 12 నెలల జైలు, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ పెద్దాపురం సివిల్ జడ్డి, జ్యుడీషియిల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఐ.దేవీరత్న కుమారి మంగళవారం తీర్పు ఇచ్చారు. ఎస్సై రఘునాఽథరావు తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గంపేట శివారు యానాదుల కాలనీలో నివసించే ఎద్దుపాటి శ్రీనివాస్ 2025 ఫిబ్రవరి 26వ (శివరాత్రి)తేదీ తెల్లవారుజామున తన ఇంటికి తాళం వేసి గోనాడ గ్రామంలోని ఏలేరు కాలువలో స్నానానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికీ ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా, ఇంటిలోని 20 గ్రాముల బంగారం మాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గుడ్ల సతీష్, తమ్మిశెట్టి సాయి, బొండపల్లి అచ్యుత సతీష్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. విచారణలో వారు నేరం చేసినట్టు రుజువు కావడంతో పైవిధంగా న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు.
ట్రైబల్ క్రీడలకు 8న జట్ల ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ స్కీం పథకంలో భాగంగా ట్రైబల్ క్రీడాకారుల్లో నైపుణ్యాలు వెలికితీసేందుకు మొదటిసారిగా ఖేలో ఇండియా ట్రైబల్ క్రీడలు పేరుతో జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. డీఎస్‌డీఓ వి.సతీష్ కుమార్ మంగళవారం ఈ విషయం తెలిపారు. పురుషులు, మహిళలకు ఓపెన్ కేటగిరిలో అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, హాకీ, ఫుట్‌బాల్ పోటీలు జరుగుతాయన్నారు. వీటిని జిల్లాలో అర్హులైన ట్రైబల్ క్రీడాకారులను ఎంపికను గురువారం డీఎస్‌ఏలో ఎంపిక నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి కలవారు ఆ రోజు ఉదయం 9 గంటలకు డీఎస్‌ఏలో రిపోర్టు చేయాలని కోరారు.
104 కిలోల గంజాయి స్వాధీనం
తొండంగి: ఒడిశా, విశాఖ ఏజెన్సీ నుంచి బెంగళూరుకు తరలిస్తున్న గంజాయిని జాతీయ రహదారిపై బెండపూడి వై.జంక్షన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా కేరళకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసి, 104 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, తొండంగి ఎస్సై జగన్మోహనరావు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేస్తుండగా, ఓ లారీపై గంజాయిని గుర్తించారు. దాని డ్రైవర్ కేరళ రాష్ట్రం కన్నూర్ జిల్లా పుతాపరాకు చెందిన పుడియపురల్ సమీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరికి సంబంధించిన ఓ కారును కూడా అదుపులోకి తీసుకున్నారు. దానిలో కేరళ రాష్ట్రం ఎర్నాకులం నావెల్ ఆర్నమెంట్ నదపొలువకు చెందిన కేపీ సలీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 104 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, లారీ, కారును సీజ్ చేశారు. గంజాయి విలువ రూ. 52 లక్షలు ఉంటుందని, దీనిపై ఎన్‌డీపీఎస్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.
ఆటో ఢీకొని వ్యక్తి మృతి


