అర్జునుని మించిన ప్రేమాస్పదుడు లేడు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): అర్జునుడిని మించిన ప్రేమాస్పదుడు నాకు లేడు. భార్య కానీ, మిత్రులు కానీ, జ్ఞాతులు, బంధువులు కానీ అర్జునుని కంటే అధికులు కారని కృష్ణుడు దారుకునితో చెబుతాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఆయన బుధవారం హిందూ సమాజంలో 42వ రోజు ప్రవచనంలో సైంధవ వధను వివరించారు.
ఆయన మాట్లాడుతూ మరుసటి రోజు సూర్యాస్తమయంలోగా సైంధవుని వధించకపోతే, అగ్ని ప్రవేశం చేస్తానన్న అర్జునుని భీషణ ప్రతినతో కృష్ణుడు ఆందోళన చెందాడు. ఆ రాత్రి శిబిరానికి వచ్చిన కృష్ణార్జునులు శివుని పూజించారు. అర్జునుడు కృష్ణుని కూడా పూజించాడన్నారు. శివకేశవుల మధ్య భేద దృష్టి వేద విరుద్ధమని తెలిపారు. యుద్ధక్షేత్రంలో అర్జునుడు తనకు అడ్డువచ్చిన మహారథులను జయించి సైంధవుని సమీపిస్తున్నాడు. ఆ సమయంలో కృష్ణుడు సూర్యుని చుట్టూ చీకట్లు సృష్టించాడు, కేవలం సైంధవుడు ఒక్కడికే సూర్యాస్తమయం గోచరించింది. అతడు ఆనందంతో తల ఎత్తి సూర్యుని చూస్తున్నాడు. కేశవుని సూచనపై అర్జునుడు సైంధవుడి శిరస్సును ఖండించాడు. దీంతో శాపవశాన తండ్రి కూడా మరణించాడని సామవేదం అన్నారు. అభిమన్యుని వధకు అర్జునుడు ప్రతీకారం తీర్చుకున్నాడు. వధకు గురయ్యే సమయంలో అభిమన్యుని వయసు గురించి సామవేదం కొన్ని ఆసక్తికరమైన రహస్యాలను వివరించారు. చంద్రుని పుత్రుడు వర్చుడు అభిమన్యునిగా జన్మించాడు. భూలోకంలో తాను కేవలం 16 సంవత్సరాలు మాత్రమే ఉంటానని వర్చుడు ముందుగానే ప్రకటించాడు. పాండవులు 12 సంవత్సరాలు వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాత వాసం తీసివేస్తే, మూడవ ఏటానే అభిమన్యుడు ఉపనయనాది సంస్కారాలు పొందాడా అని అనుమానం రావచ్చు. విప్రునికి ఏడవ ఏట, క్షత్రియునికి 11వ ఏట ఉపనయనం చేయాలంటే, ఆయా వయసులు అతిక్రమించకుండా వారికి ఉపనయనాలు చేయాలని అర్థమని సామవేదం అన్నారు.
నీలకంఠీయ వ్యాఖ్యానం ప్రకారం క్షత్రియునికి 8వ ఏట ఉపనయనాది సంస్కారాలు చేయవచ్చును. ఉపనయనం తరువాతనే వర్చుడు చెప్పిన 16 సంవత్సరాలను లెక్కపెట్టాలని భాష్యకారులు చెప్పారని సామవేదం అన్నారు. కనుక, అభిమన్యుడు 24 లేక 25 సంవత్సరాల ప్రాయంలో వీరమరణం పొందాడని భావించవచ్చునని వివరించారు. ముందుగా భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు సభకు శుభారంభం పలికారు.


