ఆశపెట్టి దోచేశారు.. | - | Sakshi
Sakshi News home page

ఆశపెట్టి దోచేశారు..

Jan 8 2026 9:32 AM | Updated on Jan 8 2026 9:32 AM

ఆశపెట

ఆశపెట్టి దోచేశారు..

మహిళలను మోసం చేసిన ప్రైవేటు సంస్థ

రెట్టింపు ఇస్తామని డిపాజిట్ల సేకరణ

మెచ్యూరిటీ ముగిసినా ముఖంచాటు

ఐటీడీఏ ఏపీఓకు బాధితుల ఫిర్యాదు

చింతూరు: రెట్టింపు సొమ్ములు వస్తాయనే ఆశతో ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలో పెట్టిన డిపాజిట్లకు గడువు ముగిసినా చెల్లింపులు చేయకపోవడంతో ఆ మహిళలు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఎక్కే మెట్టు.. దిగేమెట్టుగా పోలీసులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఎటపాక మండలం గన్నవరం, గొందిరాజుపేట, కాపుగొంపల్లికి చెందిన చాలా మంది మహిళల వ్యధ ఇది. బాధిత మహిళలు తెలిపిన వివరాల ప్రకారం.. 2011లో గన్నవరం పోస్టాఫీసులో పోస్ట్‌మన్‌గా పనిచేస్తున్న శ్రీను తమ వద్దకు వచ్చి సొమ్ములు డిపాజిట్‌ చేస్తే ఏడేళ్ల తరువాత రెట్టింపవుతాయని వారిని నమ్మించాడు. పోస్ట్‌మాన్‌ కావడంతో పోస్టాఫీసు పథకమని నమ్మిన తాము డిపాజిట్‌ నిమిత్తం రూ.10 వేల నుంచి రూ.70 వేల వరకు అతనికి ఇచ్చామని, కొంతమంది నెలవారీగా సొమ్ములు కట్టారని వారు తెలిపారు. కాగా అతను తమ సొమ్ములను పోస్టాఫీసులో కాకుండా ఓ ప్రైవేటు సంస్థలో డిపాజిట్‌ చేసినట్లు రెండేళ్ల తరువాత తెలియడంతో అతనిని నిలదీసినట్లు వారు తెలిపారు. సంస్థ నమ్మకమైందని, మీ సొమ్ములు ఎక్కడికీ పోవని, నాది భరోసా అంటూ తమను నమ్మించాడని మహిళలు పేర్కొన్నారు. ఇలా 2011 నుంచి 2014 వరకు పలువురు రూ.లక్షల్లో డిపాజిట్‌ చేశామని, తమ సొమ్ములకు సంబంధించి బాండ్లు కూడా ఇచ్చాడని వారు తెలిపారు. ఏడేళ్ల గడువు ముగిసినా నేటికీ తమకు మెచ్యూరిటీ సొమ్ములు ఇవ్వలేదని, దీనిపై అతనిని ఎన్నిసార్లు అడిగినా సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితులు వాపోయారు. ఈ విషయంపై పలుమార్లు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తాము కూడా అతని బాధితులమేనంటూ పోలీసులు చెబుతున్నారని వారు తెలిపారు.

రెక్కల కష్టం పరుల పాలైంది

రెక్కల కష్టంతో పైసా, పైసా కూడబెట్టి రెట్టింపు సొమ్ములు వస్తాయనే ఆశతో వారంతా డిపాజిట్‌ చేశారు. డబ్బులు పెట్టేది ప్రైవేటు సంస్థ అని తెలిసివుంటే అప్పుడే ఒప్పుకొనేవాళ్లం కాదని, గట్టిగా ప్రశ్నించిన కొందరికి సొమ్ములు ఇచ్చేశారని, తమకు నేటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు.

ఐటీడీఏ ఏపీవోకు ఫిర్యాదు

గడువు తీరినా తమ మెచ్యూరిటీ సొమ్ములు రాకపోవడం, పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో బాధిత మహిళలంతా కలసి బుధవారం చింతూరు ఐటీడీఏకు వచ్చారు. పీవో లేకపోవడంతో ఏపీవో రామతులసికి వారు ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఏపీవో విషయాన్ని పీవో శుభం నొఖ్వాల్‌ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

రూ.60 వేలు డిపాజిట్‌ చేశా

రెట్టింపు సొమ్ములు వస్తాయని నమ్మబలకడంతో 2011లో రూ.10 వేలు, 2014లో రూ.50 వేలు డిపాజిట్‌ చేశాను. మొత్తంగా నాకు రూ.1.36 లక్షల వరకు రావాల్సివుండగా గడువుతీరినా ఆ సొమ్ములు నేటికీ చెల్లించలేదు.

– గొంది పున్నమ్మ, గంగరాజుపేట, ఎటపాక మండలం

పోస్టాఫీసులో అనుకుని మోసపోయా

పోస్టాఫీసులో డిపాజిట్‌ పథకమని చెప్పడంతో నమ్మి నెలకు రూ.550 చొప్పున ఏడేళ్ల పాటు సొమ్ములు కట్టాను. రూ 37,500 కట్టినట్లుగా బాండ్‌ ఇచ్చినా ఆ సొమ్ములు మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు. ఒకనెల కట్టడం ఆలస్యమైతే వడ్డీ కూడా కట్టించుకున్నారు.

– తోట అరుణ, కాపుగొంపల్లి, ఎటపాక మండలం

అధికారులు న్యాయం చేయాలి

రెట్టింపు సొమ్ములు వస్తాయనే ఆశతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ములు కట్టి మోసపోయాం. ఈ విషయంపై అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు తమ సొమ్ములు తిరిగి ఇచ్చేలా న్యాయంచేయాలి.

– ముక్కెర సావిత్రమ్మ, గన్నవరం, ఎటపాక మండలం

ఆశపెట్టి దోచేశారు.. 1
1/3

ఆశపెట్టి దోచేశారు..

ఆశపెట్టి దోచేశారు.. 2
2/3

ఆశపెట్టి దోచేశారు..

ఆశపెట్టి దోచేశారు.. 3
3/3

ఆశపెట్టి దోచేశారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement