బాధితుడికి న్యాయం జరగకపోతే ఆందోళనే..
తుని రూరల్: ముత్తిన రామకృష్ణపై దాడికి పాల్పడిన ఆరుగురిని అరెస్ట్ చేయాలని బీసీ, యాదవ సంఘాల నాయకులు తేటగుంటలోని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి కార్యాలయం ఎదుట బుధవారం రాత్రి ఆందోళన చేశారు. తొండంగి మండలం తమ్మయ్యపేటలో డిసెంబర్ 31న జరిగిన దాడిలో కత్తిపూడికి చెందిన ముత్తిన రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. దాడికి పాల్పడిన నిందితులలో కొందరిని అదుపులోకి తీసుకుని, మర్నాడు వదిలేయడంపై నాయకులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు, అల్లి రాంబాబు తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. అన్యాయాన్ని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి దృష్టికి తీసుకు వెళ్లేందుకు తేటగుంట కార్యాలయానికి క్షతగాత్రుడు ముత్తిన రామకృష్ణను తీసుకుని కుటుంబ సభ్యులు, అనుచరులు, నాయకులు చేరుకున్నారు. న్యాయం చేయాలని యనమల కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. క్షతగాత్రుడి మొరను చెప్పేందుకు మాజీ మంత్రి రామకృష్ణుడు వద్దకు వచ్చినా, ఆయన లేరని అక్కడున్న వారు చెప్పారని ఆ నాయకులు అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో 70 వేల మందికి పైగా బీసీలు, యాదవులు ఉన్నా అణచివేతకు గురవుతున్నారని అన్నారు. యనమల రామకృష్ణుడు స్పందించి దాడులకు అడ్డుకట్టు వేయాలన్నారు. బాధితుడికి న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని నాయకులు అన్నారు. అనంతరం ప్రత్యేక వాహనాల్లో స్వగ్రామం కత్తిపూడికి బయలుదేరి వెళ్లిపోయారు.


