గోదారేది సాయీ..?
రంపచోడవరం: తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద నిర్మించిన సత్యసాయి తాగునీటి పథకం నుంచి నీటి సరఫరా రెండు నెలలుగా నిలిచిపోయింది. గోదావరి నీటికి అలవాటు పడిన ప్రజలు నీరు రాని పరిస్థితిలో సత్యసాయి పైప్‌లైన్‌లో ఎక్కడ చిన్న నీటి ధార వచ్చినా అక్కడి నుంచి డబ్బాలతో నీరు తెచ్చుకునేందుకు వెళ్తారు. ఈ పరిస్థితిని చూస్తే గోదావరి నీటికి ఎంత ఆరాటపడుతున్నారో అర్థమవుతుంది. పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం, కోరుకొండ, సీతానగరం మండలాలకు పురుషోత్తపట్నం సత్యసాయి పథకం నుంచి తాగునీటిని నిత్యం సరఫరా చేసేవారు. నవంబరు నుంచి నేటి వరకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ పథకం ప్రారంభంలో నిర్వహణ బాధ్యతను ఎల్‌అండ్‌టీ కంపెనీ చూసేది. తరువాత కాలంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం కాంట్రాక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది.
ఇన్‌టేక్ వెల్‌లో మోటార్లకు మరమ్మతులు
పురుషోత్తపట్నం తాగునీటి పథకం నిర్మించి సుమారు 20 ఏళ్లు గడుస్తున్నాయి. ఈ కాలంలో తూతూ మంత్రంగా మోటార్లకు మరమ్మతులు చేయించి వినియోగించడం తప్ప కొత్త మోటార్లు ఏర్పాటు చేయలేదనే విమర్శలు ఉన్నాయి. పురుషోత్తపట్నం తాగునీటి పథకంలో గోదావరి నుంచి నీటిని తోడి ఫిల్టర్ హౌస్‌కు అక్కడి నుంచి కొండపై ట్యాంకుకు సరఫరా చేసేందుకు 16 మోటార్లు పనిచేయాలి. అయితే గోదావరిలోని ఇన్‌టేక్ వెల్‌లోని మూడు మోటార్లు పనిచేయడం లేదు. నీటిని తోడే పంపులు కూడా మరమ్మతులకు గురయ్యాయి. పురుషోత్తపట్నం పంపు హౌస్ నుంచి 150 కిలోమీటర్ల మేర తాగునీటి పైప్‌లైను ఉంది. పైప్‌లైను అనేక చోట్ల మరమ్మతులకు గురి కావడంతో అనేక చోట్ల లీకేజీలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు పైప్‌లైన్లకు సీఐడీ జాయింట్లు బిగించకుండా, తాత్కాలిక పనులు చేయడంతో పైప్‌లైను ఆధ్వానంగా మారింది. ఏటా కాంట్రాక్టర్ తాగునీటి సరఫరా కంటే మరమ్మతులు కోసమే ఎక్కువ బిల్లులు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కాంట్రాక్టర్ పురుషోత్తపట్నం తాగునీటి పథకాన్ని నిర్వహించలేనని కాగితం రాసిచ్చారని ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్లు చెబుతున్నారు. తాగునీటి పథకాల టెండర్ విషయంలో కాంట్రాక్టర్లు కుమ్మకై తమకు కావాల్సిన పథకాలను దక్కించుకుంటున్నారు. గడువులు పూర్తయినా తరువాత ఆరు నెలల పొడగింపు తరువాత ఎవరూ టెండర్‌కు రాలేని పరిస్థితులు ఉన్నాయి.
రోజుకు 40 లక్షల లీటర్లు సరఫరా చేయాలి
పురుషోత్తపట్నం తాగునీటి పథకం ద్వారా నాలుగు మండలాల్లోని గ్రామాలకు 40 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయాలి. ప్రాజెక్టు పనిచేసిన కాలంలో కూడా 30 లక్షలకు మించి నీటి సరఫరా ఎప్పుడూ జరగలేదు. ట్యాంకు నిల్వ సామర్ధ్యం కోటి లీటర్ల వరకు ఉంది. గత ఏడాది పురుషోత్తపట్నం తాగునీటి పథకంలో పనిచేసే 53 మంది కార్మికులు తమకు జీతాలు చెల్లించలేదని రిలే దీక్షలు చేపట్టి విధులకు హాజరు కాలేదు. ఇప్పుడు కాంట్రాక్టర్ చేతులేత్తేసి పథకానికి తూట్లు పొడుస్తున్నారు.
ప్రాజెక్టు స్వరూపం ఇదీ..
ప్రాజెక్టు పేరు : సత్యసాయి పురుషోత్తపట్నం తాగునీటి పథకం
నిల్వ సామర్ధ్యం : కోటి లీటర్లు
రోజు వారీ సరఫరా : 45 లక్షల లీటర్లు
సరఫరా చేస్తుంది : నిల్
నీరు వెళ్లే మండలాలు : దేవీపట్నం, సీతానగరం, గోకవరం, కోరుకొండ, సీతానగరం
జనాభా : 2.18 లక్షలు
వాటర్ ట్యాంకులు : 50
నివాసిత ప్రాంతాలు : 82
సత్యసాయి పథకం నుంచి
తాగునీటి సరఫరాకు అంతరాయం
మొరాయించిన మోటార్లతో సమస్య
రెండు నెలలుగా నిధులివ్వని సర్కారు
నిర్వహణకు నీళ్లొదిలేసిన కాంట్రాక్టర్
82 గ్రామాలపై తీవ్ర ప్రభావం
సీఈ దృష్టికి సమస్యను తీసుకువెళ్లాం
పురుషోత్తపట్నం తాగునీటి పథకం ద్వారా నీరు సరఫరా కావడం లేదు. ఇక్కడ పరిస్థితులను ఆర్‌డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజినీర్ దృష్టికి తీసుకువెళ్లాము. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాము.
– ఎంవీ రామకృష్ణ, ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్
సత్యసాయి లక్ష్యాన్ని దెబ్బ తీస్తున్నారు
పుట్టపర్తి సత్యసాయి బాబా మంచి లక్ష్యంతో తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. కాంట్రాక్టర్ వ్యవస్థతో లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నారు. తక్షణమే ఈ పథకం ద్వారా నీటిని సరఫరా చేయాలి. లోపాలను సరి చేయాలి.
– తెల్లం శేఖర్, పోతవరం, ఆదివాసీ జేఏసీ నాయకుడు
గోదావరి నీరు అలవాటైపోయింది
మా గ్రామంలో సత్యసాయి వాటర్ ట్యాంక్ ఉంది. ఎప్పటి నుంచో గోదావరి నీరు తాగుతున్నాం. ఆ నీటిని తాగేందుకు అలవాటు పడ్డాం. ఇప్పుడు ఇందుకూరుపేట వెళ్లి ప్రైవేట్ ప్లాంట్ల నుంచి నీటిని కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది.
– చవలం వెంకన్నదొర, కంబలంపాలెం
గోదారేది సాయీ..?
గోదారేది సాయీ..?


