టీచర్లూ.. వివరాలు అప్‌లోడ్ చేయండి
డీఈఓ మల్లేశ్వరరావు
గంగవరం: జిల్లాలోని ప్రభుత్వ విద్యాలయాల్లో పని చేస్తున్న అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులూ తమ వ్యక్తి గత వివరాలను లీప్ యాప్‌లో ఈ నెల తొమ్మిదో తేదీలోగా నమోదు చేయాలని ఏజెన్సీ డీఈఓ వై.మల్లేశ్వరరావు తెలిపారు. విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నెల తొమ్మిదో తేదీ తుది గడువు అన్నారు. ఈ లోగా అప్‌లోడ్ చేయాలని, మార్పులు, చేర్పులు ఉంటే రెండు రోజుల్లో సరిచేసుకోవాలన్నారు. ఇక గడువు పొడిగింపునకు అవకాశం ఉండదని, ఉపాధ్యాయులు గమనించి వివరాలను తక్షణమే నమోదు చేసుకోవాలన్నారు.
స్కేటింగ్ పోటీలలో
జిల్లాకు పతకాలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): గ్వాలియర్‌లో జరిగిన జాతీయస్థాయి పాఠశాల క్రీడాసమాఖ్య స్కేటింగ్ పోటీలలో జిల్లా క్రీడాకారులు ప్రతిభను కనపరచి పతకాలు సాధించారని ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సుధారాణి బుధవారం తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి పరిధిలో 6 బంగారు, 2 వెండి, 5 రజత పతకాలు జిల్లా క్రీడాకారులు కై వసం చేసుకున్నారన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులు డీఈఓ పి.రమేష్‌ను ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను డీఈఓ అభినందించారు. పిఈటీ సంఘ మాజీ అధ్యక్షుడు ఎల్.జార్జి, టీం మేనేజర్ దుర్గా, కోచ్ హరికృష్ణ, ఏసుబాబు పాల్గొన్నారు.
బ్లో అవుట్ వెనుక అవినీతిని
బహిర్గతం చేయాలి
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): కోనసీమ జిల్లా ఇరుసుమండలో జరిగిన బ్లోఅవుట్ వెనుక ఉన్న అవినీతి, అక్రమాలను ఉన్నతాధికారులు తక్షణమే బహిర్గతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ అన్నారు. ఆయన బుధవారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బోరింగ్– 5 నిర్వహణ బాధ్యతలను 2025 ఏప్రిల్ నుంచి డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు అప్పజెప్పారన్నారు. పాతబడిన, ప్రొడెక్షన్ తగ్గిన బావులను ఓఎన్‌జీసీ 60–40 నిష్పత్తి చొప్పున నిర్వహణ బాధ్యతల కాంట్రాక్టును ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తోందన్నారు. ఆ విధంగా రూ.1402 కోట్లకు ఆ కంపెనీకి కట్టబెట్టారని ఆరోపించారు. ప్రమాదానికి హైప్రెజర్ కారణమని అధికారులే చెబుతున్నారని, మరి హైప్రెజర్ ఉన్న వెల్‌ను, లో ప్రెజర్‌గా చూపించి ప్రైవేటు కాంట్రాక్టు కంపెనీకి ఎలా అప్పజెప్పారని ప్రశ్నించారు. ఓఎన్‌జీసీలో సహజ వనరులను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారడానికి తాజా ఘటన నిదర్శనమన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు బి.పవన్, మూర్తి, వి.రామచంద్రరావు, బి.పూర్ణిమరాజు తదితరులు పాల్గొన్నారు.
సత్యదేవునికి
జన్మ నక్షత్ర పూజలు
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి జన్మ నక్షత్రం ‘మఖ’ సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకం, ఆయుష్యహోమం నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారి ఆలయాన్ని తెరిచి పూజలు చేశారు. అనంతరం సత్యదేవుడు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి, శంకరుల మూలవిరాట్ లకు పండితులు పంచామృతాలతో మహాన్యాశ పూర్వక అభిషేకం నిర్వహించారు. అలంకరించి పూజలు చేశారు. తరువాత ఉదయం ఆరు గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. యాగశాలలో ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు స్వామివారికి ఆయుష్య హోమం, అనంతరం పూర్ణాహుతి సమర్పించారు. స్వామి, అమ్మవార్లకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠీ, చిట్టి శివ, యనమండ్ర శర్మ, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
టీచర్లూ.. వివరాలు అప్‌లోడ్ చేయండి
టీచర్లూ.. వివరాలు అప్‌లోడ్ చేయండి


