రంగుమారిన సోయాను కొనుగోలు చేయాలి
ఆదిలాబాద్: రంగుమారిన సోయాబీన్‌ను కొనుగోలు చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ సాగు రైతులకు ముఖ్య ఆదాయ వనరుగా ఉందని, ఈ సంవత్సరం ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పంట రంగు మారిందని తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఫేర్ ఆవరేజ్ క్వాలిటీ నిబంధనల ప్రకారం రంగు మారిన పంటను కొనుగోలు చేయడం లేదని తెలిపారు. రంగు మారిన పంట కొనుగోలుతో వచ్చే నష్టాన్ని 50శాతం వరకు భరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిగతా నష్టాన్ని భరించి రైతులకు అండగా నిలవాలని సూచించారు. అప్పుడే అన్నదాతలపై ఉన్న ఆర్థికభారం తగ్గి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు. రైతులను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
అసెంబ్లీలో మాట్లాడుతున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్


