పెండింగ్ దరఖాస్తులపై అలసత్వం వద్దు
కై లాస్‌నగర్: భూసమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించవద్దని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, సర్వేయర్లతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల నుంచి అందే ప్రతీ దరఖాస్తును నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. భూభారతి కింద 60 రోజుల మించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే క్లియర్ చేయాలన్నారు. ఎస్‌ఐఆర్, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. రైతు ఆత్మహత్యలు, పిడుగుపాటు మరణాలు, హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించిన నివేదికలు త్వరగా పూర్తిచేసి బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందేలా శ్రద్ధ వహించాలన్నారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పెండింగ్, బాధితుల బ్యాంక్ ఖాతాల వివరాల సేకరణ వంటి అంశాలు వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, ఆర్డీవో స్రవంతి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
వికేంద్రీకృత ప్రజావాణి మరింత బలోపేతం చేయాలి
కై లాస్‌నగర్: వికేంద్రీకృత ప్రజావాణిని మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాస్థాయి అధికారులు, ఎంపీడీవోలు, సాట్ డైరెక్టర్, రిసోర్స్ పర్సన్లు, పౌర సమాజ సభ్యులతో కలిసి ఆయా మండలాల్లో గతేడాది సాధించిన పురోగతిపై ఆరా తీశారు. వికేంద్రీకృత ప్రజావాణిని మరింత ముందుకు తీసుకెళ్లడం, జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైన మార్పులపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. భవిష్యత్తులో కలెక్టరేట్ ప్రజావాణి, మండల ప్రజావాణి, వికేంద్రీకృత ప్రజావాణి ప్రక్రియలను ఏకీకృతం చేయాలని పేర్కొన్నారు. మండల ప్రజావాణి ప్రక్రియను డిజిటలైజ్ చేసి వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. కొత్త ప్రజా వాణి విధానం జనవరి 19 నుంచి ప్రతీ సోమవారం మండల స్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో స్రవంతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


