గిరి.. కొబ్బరి సిరి
రంపచోడవరం: కొబ్బరి.. అనగానే మనకు కోనసీమ గుర్తొస్తుంది.. కానీ ఇప్పుడు ఆ పచ్చదనం మన్యం కొండల్లోనూ కనువిందు చేయనుంది.. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాన్ని కొబ్బరి సాగుకు కేంద్ర బిందువుగా మార్చేందుకు పందిరిమామిడి ఉద్యాన పరిశోధన స్థానం ( హెచ్‌ఆర్‌ఎస్) సంకల్పించింది. కొబ్బరి అభివృద్ధి సంస్థ సహకారంతో గిరిజన రైతుల జీవితాల్లో వెలుగులు నింపేలా సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసింది. వీరి కృషి ఫలిస్తే ఏజెన్సీ ప్రాంతం త్వరలోనే మన్యపు కోనసీమగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
గతంలో ఏజెన్సీ రైతులు కొబ్బరి మొక్కల కోసం మైదాన ప్రాంతాలపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ కష్టాలను తీరుస్తూ పందిరిమామిడి హెచ్‌ఆర్‌ఎస్‌లోనే సొంతంగా నర్సరీని ఏర్పాటు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట నుంచి నాణ్యమైన విత్తన కాయలను సేకరించి, ఇక్కడ 10 నెలల పాటు పెంచి రైతులకు అందిస్తున్నారు. ఒక్కో మొక్క ధర రూ. 100 కాగా, కొనుగోలు చేసిన రైతు ఖాతాలో కొబ్బరి అభివృద్ధి సంస్థ ద్వారా రూ.70 రాయితీ జమ అవుతుంది. అంటే కేవలం రూ.30కే రైతుకు ఒక మేలైన మొక్క అందుతోంది. గత ఏడాది మూడు వేల మొక్కలు పంపిణీ చేయగా, ఈ ఏడాది ఏకంగా ఏడు వేల మొక్కలు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కొబ్బరి చిప్పలు.. కళాఖండాలు
కేవలం సాగుకే పరిమితం కాకుండా, కొబ్బరి ఆధారిత పరిశ్రమలపై కూడా శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా కొబ్బరి చిప్పలతో అలంకరణ వస్తువుల తయారీపై గిరిజన యువతులకు శిక్షణ ఇచ్చారు. పర్యాటక ప్రాంతమైన ఏజెన్సీలో ఈ వస్తువులకు మంచి డిమాండ్ ఉంటుంది. శిక్షణ పొందిన వారికి రూ. 5 వేల విలువైన టూల్ కిట్లు కూడా అందజేశామని శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్రయోగాత్మకం.. గంగా బొండాం
సాధారణ రకాలతో పాటు, త్వరగా దిగుబడినిచ్చే గంగా బొండం రకం మొక్కలను కూడా హెచ్‌ఆర్‌ఎస్‌లో ప్రయోగాత్మకంగా నాటారు. వీటి పెరుగుదల, దిగుబడి ఇక్కడి వాతావరణానికి అనుకూలిస్తే, రాబోయే రోజుల్లో రైతులకు ఈ రకాన్ని కూడా పెద్ద ఎత్తున పంపిణీ చేయనున్నారు. దీనివల్ల రైతులకు మంచి ఆదాయం సమకూరనుంది.
ఏజెన్సీ ప్రాంతం కొబ్బరికి నాన్ ట్రేడేషనల్ ప్రాంతం కావడంతో రాబోయే రెండేళ్ల కాలంలో కొబ్బరిని 2 వేల ఎకరాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గిరిజన రైతులు కొబ్బరి సాగుపై ఆసక్తి చూపడంతో విస్తరణం ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
గిరిసీమకు కొబ్బరి సిరి వస్తోంది.. ఇక్కడ సాగు ఊపిరి పోసుకుంటోంది.. పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో పందిరిమామిడి ఉద్యాన పరిశోధన స్థానం, కొబ్బరి అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాన్ని కొబ్బరి సాగుకు కేంద్ర బిందువుగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. తక్కువ ధరకే నాణ్యమైన మొక్కలను అందించడమే కాకుండా, కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల ద్వారా గిరిజన యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సరికొత్త ప్రణాళికలు రూపుదిద్దుకుంది. త్వరలోనే మన్యపు కోనసీమ ఆవిష్కృతం కానుంది.
పొలం గట్లపై నాటుకున్నాం
పందిరిమామిడి పరిశోధన స్థానం నుంచి తీసుకువచ్చిన కొబ్బరి మొక్కలను పొలం గట్లు, ఇంటి ఆవరణలో ఖాళీగా ఉన్నచోట నాటుకున్నాం. వాతావరణం అనుకూలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇవి మాకు అదనపు ఆదాయాన్ని ఇస్తాయనే నమ్మకం ఉంది.
–పండా నాగన్నదొర, ఎర్రంపాలెం, రంపచోడవరం మండలం
కొబ్బరి విస్తరణకు చర్యలు
ఏజెన్సీ ప్రాంతంలో కొబ్బరి సాగు విస్తరణకు కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు సహకారంతో చర్యలు చేపట్టాం. రైతులు ముందుగా మొక్కలు కొనుగోలు చేసుకుంటే బోర్డు 70 శాతం రాయితీ ఇస్తుంది. గంగాబొండం రకం పెరుగుదల బాగుంటే క్షేత్ర స్థాయిలో పంపిణీకి చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ పీసీ వెంగయ్య,
ప్రధాన శాస్త్రవేత్త, పందిరిమామిడి ఉద్యాన పరిశోధన స్థానం
సాగుకు మన్యంలో ఊపిరి
రంపచోడవరం ఏజెన్సీలో శ్రీకారం
పందిరిమామిడి ఉద్యాన పరిశోధన స్థానం, కొబ్బరి అభివృద్ధి సంస్థ ప్రోత్సాహం
తక్కువ ధరకు నాణ్యమైన మొక్కల పంపిణీ
కొబ్బరి ఆధారిత ఉత్పత్తులపై
గిరి యువతకు శిక్షణ
గిరి.. కొబ్బరి సిరి
గిరి.. కొబ్బరి సిరి
గిరి.. కొబ్బరి సిరి
గిరి.. కొబ్బరి సిరి


