ఉచ్చు
ఉసురు తీస్తున్న
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఏర్పాటుచేసిన విద్యుత్ ఉచ్చులు మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. తాజాగా వారి ఉచ్చుకు సీఆర్పీఎఫ్ ఏఎస్‌ఐ బలయ్యారు. వన్యప్రాణుల కోసం అటవీ ప్రాంతంలో అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ప్రాణాలు కోల్పోయారు. తరచూ ఇలా ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నా వేటగాళ్లపై కఠినంగా వ్యవహరించడం లేదు. కేసులు నమోదు చేసి చేతులు దులుపు కోవడం వల్లే వారి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అటవీశాఖ అధికారులకు పట్టదా!
యార్లగడ్డలో వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ ఉచ్చులో చిక్కుకుని మృతి చెందిన గేదెలు (ఫైల్)
వై.రామవరం/గంగవరం/చింతూరు: జిల్లాలో వై.రామవరం, గంగవరం, చింతూరు మండలాల్లో వన్యప్రాణాల వేట యథేచ్ఛగా జరుగుతోంది. అధికశాతం వేటగాళ్లు విద్యుత్ ఉచ్చును వినియోగిస్తున్నారు. దీనివల్ల వై.రామవరం మండలంలో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి.
● మోతుగూడెం పోలీసుస్టేషన్ పరిధిలో ఇంతులూరు వాగు, ఒడియా క్యాంపు, సుకుమామిడి, మంగంపాడు, ఎంసీడీ క్యాంప్ విద్యుత్ ఉచ్చులతో అడవి జంతువులను వేటాడుతున్నారు. డొంకరాయి– మోతుగూడెం గిరిజన గ్రామాల మీదుగా 11కేవీ లైన్ విద్యుత్‌ను వినియోగిస్తున్నట్టు తెలిసింది. దాదాపు చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. దీనివల్ల రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతున్న సందర్భాలు ఉన్నాయి. అడవిపందులు, అడవి గేదెలు, దుప్పులు, జింకలను వేటాడుతున్నట్టు సమా చారం. రాత్రి నుంచి తెల్లవారు వరకు విద్యుత్ కంచెకు సరఫరా ఉంచి తరువాత తొలగిస్తున్నారు. విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.
● గంగవరం మండలంలో మొల్లేరు, లొక్కొండ, పిడతమామిడి, గొరగొమ్మి, మోహనాపురం అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట విచ్చలవిడిగా జరుగుతోంది. ఎక్కువగా విద్యుత్ ఉచ్చు ఏర్పాటుచేసి వేటాడుతున్నారు. మొల్లేరు ప్రాంతానికి చెందిన పెనుమత్స ధనరాజ్ అదే ప్రాంతంలోని శివారులో మామిడితోటలో మకాం ఉండేవారు. గత మే 27న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగిరాలేదు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడికి సమీపంలోని అటవీప్రాంతంలో పూర్తిగా పాడైన అతని మృతదేహం కనిపించింది. దీనిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. వన్యప్రాణులకోసం ఏర్పాటుచేసిన విద్యుత్ ఉచ్చులో చిక్కుకుని మృతి చెందినట్టుగా వారు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు.
అడవి జంతువుల వేటకు అడ్డా..
విద్యుత్ ఉచ్చులతో అడవి జంతువుల వేటకు వై.రామవరం మండలం అడ్డాగా మారింది. వేటగాళ్ల ఆగడాలకు వన్యప్రాణులతో పాటు అమాయకులు బలైన సంఘటనలు ఉన్నాయి. పోలీసుల దృష్టికి వచ్చినవి మాత్రమే బయటకు వస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
కొండపోడుకు వెళ్తూ..
చవిటిదిబ్బలు గ్రామానికి సమీపంలోని అటవీప్రాంతంలో వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ ఉచ్చులో చిక్కుకుని అదే గ్రామానికి చెందిన గిరిజన రైతు కుర్రే వెంకటేశ్వర్లు (40) ప్రాణాలు కోల్పోయాడు. అడవి మార్గంలో కొండపోడుకు వెళ్తుండగా విద్యుత్ వైరు కాలుకు తగలడంతో షాక్ గురై చనిపోయాడు. ఈ ఘటన మే 5, 2007లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో విద్యుత్ తీగలు అమర్చిన ఐదుగురిని అరెస్టు చేశారు.
తాను అమర్చిన ఉచ్చులో తానే చిక్కుకుని..
యార్లగడ్డ గ్రామానికి చెందిన జంప రాజబాబు (28) విద్యుత్ ఉచ్చులతో వన్యప్రాణాలను వేటాడేవాడు. దీనిలో భాగంగా అమర్చిన ఉచ్చుకు అడవి జంతువు చిక్కింది. దాని తీసేందుకు వెళ్లిన అతని కాలుకు విద్యుత్ ఉచ్చు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఫిబ్రవరి 15, 2017లో చోటుచేసుకుంది.
ఉచ్చు వైరు తగిలి..
చవిటి దిబ్బలు గ్రామానికి చెందిన గిరిజన రైతు పూజారి భూపాలరావు (55) విద్యుత్ ఉచ్చులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. కొండపోడుకు వెళ్తుండగా వైరు తగలడంతో చిక్కుకుని మృతి చెందాడు. ఈ ఘటన అక్టోబర్ 30, 2017లో జరిగింది. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశారు.
పొలానికి వెళ్తూ చిక్కుకుని..
రాచపాలెం గ్రామానికి చెందిన వలాల నూకరాజు (53) పొలానికి వెళ్తుండగా వన్యప్రాణులకోసం ఏర్పాటుచేసిన విద్యుత్ వైరుకు తగలడంతో మృతి చెందాడు. ఈ కేసులో వన్యప్రాణులను వేటాడుతున్న ఇద్దరిని అరెస్టు చేశారు.
● సింహాద్రిపాలెం గ్రామానికి సమీప అటవీప్రాంతంలో ఏర్పాటుచేసిన విద్యుత్ ఉచ్చుకు అదే గ్రామానికి చెందిన వేట్ల శ్రీరాములరెడ్డి బలయ్యారు. పొలానికి వెళ్తుండగా ఉచ్చులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నవంబర్ 28, 2022లో జరగ్గా, ఇద్దరిని అరెస్టు చేశారు.
విద్యుత్ వైర్లతో
యథేచ్ఛగా
వన్యప్రాణుల వేట
కఠిన చర్యలు తీసుకుంటాం
విద్యుత్ కంచెలు ఏర్పాటుచేసి వన్యప్రాణులు, మనుషుల ప్రాణాలకు హాని కలిగించే వారిపై చర్యలు తీసుకుంటాం. అటవీ, వ్యవసాయ భూముల్లో ఈ విధంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దీనిపై ఇప్పటికే దిగువస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చాం.
– పంకజ్‌కుమార్ మీనా, ఏఎస్పీ, చింతూరు
చిక్కుకుని గాలిలో కలిసిపోతున్న
జంతువులు, మనుషుల ప్రాణాలు
వై.రామవరం, చింతూరు,
గంగవరం మండలాల్లో ఘటనలు
8లో
ఉచ్చు


