కమనీయం కన్యావరుణ సంవాదం
● మంత్రముగ్దులను చేసిన ఎదురు సన్నాహ మహోత్సవం
● నేత్ర పర్వంగా వెంకన్న ధ్వజారోహణం
● ఘనంగా రథోత్సవం
నక్కపల్లి: ఉపమాక వెంకన్న కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన కన్యావరుణసంవాదం (ఎదురు సన్నాహ మహోత్సవం) వేలాది మంది భక్తులను మంత్ర ముగ్ధులను చేసింది.ఉపమాక సింహాద్రాచార్యులు ఇంటివద్ద జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు. వైకుంఠనాథుని తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా తెల్లవారు జామున 2 గంటలకు గరుడాద్రిపై షడ్భుజాలతో అశ్వారూఢుడై వెలసిన మూలవిరాట్‌కు పంచామృతాలతో అభిషేకం, తొలిపూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. తదుపరి స్వర్ణాభరణాలతో అలంకరించిన శ్రీదేవి,భూదేవి సమేత వేంకటేశ్వర స్వామిని పెద్దపల్లకిలో ఉపమాక మాడవీధుల్లో తిరువీధిసేవ నిర్వహించారు.స్వామివారి కల్యాణానికి భక్తులతోపాటు అష్టదిక్పాలకులను ఆహ్వానించారు. భక్తులు కానుకలు మొక్కుబడులు సమర్పించుకున్నారు. తిరువీధి సేవ అనంతరం ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్, అర్చక స్వాములు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, శేషాచార్యులు వేదమంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. ధ్వజపటాన్ని ఎగురు వేస్తూ అష్టదిక్పాలకులు, దేవతలను స్వామివారి కల్యాణానికి ఆహ్వానించారు. ధ్వజారోహణతో కల్యాణోత్సవాలు లాంఛనంగా ప్రారంభమైనట్టు అర్చక స్వాములు తెలిపారు.ి అనంతరం బేరీ పూజ, ద్రవిడ వేద ప్రభంద పారాయణం నిర్వహించారు. బాలభోగ, రాజభోగనివేదనలు, తీర్థగోష్టి, ప్రసాద నివేదన, వినియోగం వంటి కార్యాక్రమాలు జరిగాయి. క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామిని,విశాఖ నుంచి తెచ్చిన ఆభరణాలను స్వామివారి ఉత్సవమూర్తులకు అలంకరించి ధ్వజస్తంభం ఎదురుగా ఉన్న అద్దాల మండపంలో ఉంచి భక్తులకు దర్శనం కల్పించారు.
నేత్రపర్వంగా ఎదురు సన్నాహమహోత్సవం
కల్యాణోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి ఎదురుసన్నాహమహోత్సవం జరిగింది. దీనినే కన్యావాద సంవాదం( పెళ్లిమాటల తంతుగాపేర్కొంటారు). వేంకటేశ్వరస్వామిని గరుడ వాహనంపైన, ఉభయదేవేరులను సప్పరం వాహనంపై ఉంచి చిన్నవీధి, పెద్దవీధులలో ఊరేగించారు. ఉపమాక సింహాద్రాచార్యులు ఇంటివద్ద స్వామివారిని, ఉభయనాంచారులను ఎదురెదురుగా ఉంచి పెళ్లిమాటలు, కట్నకానుకల కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్రాంత తెలుగు పండిట్, అభినవ మొల్ల డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి స్వామివారి, అమ్మవార్ల గుణగణాలను, కీర్తిప్రతిష్టలను వివరించిన సన్నివేశం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ సన్నివేశాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఉపమాక వీధులు కిక్కిరిసిపోయాయి. కల్యాణం వరకు ఉండలేని భక్తుల ఈ పెళ్లిమాటలతంతును వినడానికి ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎదురుసన్నాహ మహోత్సవం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడైన వెంకటేశ్వరస్వామిరిని రథంపై ఉంచి తిరువీధుల్లో రథోత్సవం నిర్వహించారు.
కమనీయం కన్యావరుణ సంవాదం
కమనీయం కన్యావరుణ సంవాదం
కమనీయం కన్యావరుణ సంవాదం
కమనీయం కన్యావరుణ సంవాదం


