పాత కక్షలతో యువకుడి హత్య
మాడుగుల రూరల్: పాత కక్షలతో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని గాదిరాయి జంక్షన్ వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ జి. నారాయణరావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో జంపెన గ్రామానికి చెందిన పెచ్చేటి ఉపేంద్ర(27) గురువారం రాత్రి జంపెన నుంచి కింతలి వెళ్తుండగా, మార్గ మధ్యలో గాదిరాయి విద్యుత్ ఉపకేంద్రం వద్ద మూడు రోడ్ల కూడలిలో గుర్తుతెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో తలపై తీవ్రంగా కొట్టారు. దీంతో ఉపేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికుల సమాచారం మేరకు మాడుగుల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహానికి పంచనామా జరిపి, పోస్టుమారానికి అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని శుక్రవారం మధ్యాహ్నం అనకాపల్లి డీస్పీ ఎం.శ్రావణి, కె.కోటపాడు సీఐ కె.కృష్ణతో పాటు క్లూస్ టీమ్ సభ్యులు సందర్శించారు. మృతుడికి వివాహం కాలేదు. తల్లిదండ్రులున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ జి.నారాయణరావు మాట్లాడుతూ పాతకక్షల కారణంగా ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.


