పోరుగల్లు నుంచి పోర్చుగల్‌

dinesmart start up by Tarun Aellaboina - Sakshi

నయా ఐడియాకు భారీ గుర్తింపు

దూసుకెళ్తున్న డైన్‌ స్మార్ట్‌ స్టార్టప్‌

పోర్చుగల్‌ ప్రభుత్వంతో ఒప్పందం

ఎల్లలు దాటిన వరంగల్‌ యువకుడి ప్రతిభ

స్టార్టప్‌ వీసా మీద పోర్చుగల్‌ దేశంలో తొలిసారిగా వ్యాపారం చేసే అవకాశాన్ని వరంగల్‌ యువకుడు దక్కించుకున్నాడు. భారత్‌ నుంచి అనేక కంపెనీలు పోటీ పడగా వరంగల్‌కు చెందిన ఎల్ల్లబోయిన తరుణ్‌ రూపొందించిన డైన్‌ స్మార్ట్‌ అనే స్టార్టప్‌ కంపెనీ చివరి వరకు పోటీలో నిలిచి విజేతగా నిలిచింది. - సాక్షి ప్రతినిధి, వరంగల్‌ 

మూడేళ్లలో...

హన్మకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన సుధాకర్, అనురాధ దంపతుల రెండో కుమారుడు ఎల్లబోయిన తరుణ్‌. కంప్యూటర్స్‌లో బీటెక్‌ పూర్తి చేసిన వెంటనే  2015లో ఇండియాలో డైన్‌స్మార్ట్‌ పేరుతో స్టార్టప్‌ కంపెనీని స్థాపించారు. సినిమా థియేటర్స్, మాల్స్, మల్టీప్లెక్స్, హోటళ్లలో ఉండే ప్రేక్షకులకు ఫుడ్, బేవరేజెస్‌ డెలివరీ చేయడం ఈ కంపెనీ ప్రత్యేకత. ప్లేస్టోర్‌ ద్వారా డైన్‌ స్మార్ట్‌ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని.. తద్వారా కస్టమర్లు ఆర్డర్లు ఇవ్వవచ్చు. వరంగల్‌ నగరంలో ఏషియన్‌ శ్రీదేవీ మాల్‌లో ఈ సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్‌ నగరానికి డైన్‌ స్మార్ట్‌ను విస్తరించారు. ఇక్కడ తరుణ్‌కు మౌనిక, ప్రణవ్, ఉమాశంకర్, వేణు జతయ్యారు. వీరు డైన్‌ స్మార్ట్‌ను మరింతగా విస్తరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఇనార్బిట్‌ మాల్, ఫోరమ్‌ సుజనా మాల్, మినర్వాగ్రాండ్, అలంకృత రిసార్ట్స్, లాస్‌ వెగాస్‌ డ్రైవ్‌ ఇన్‌ వంటి పేరెన్నికగల సంస్థల్లో డైన్‌స్మార్ట్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. అతి త్వరలో సినీ పోలీస్‌లో సేవలు ప్రారంభించేందుకు సంప్రదింపులు చేస్తున్నారు. 

అంతర్జాతీయ దిశగా... 

2017 నవంబర్‌లో పోర్చుగల్‌ రాజధాని లిస్బన్‌లో వెబ్‌ సమ్మిట్‌ పేరుతో జరిగిన టెక్‌ కాన్ఫరెన్స్‌కి రావాల్సిందిగా డైన్‌ స్మార్ట్‌ బృందానికి ఆహ్వానం అందింది. ఇండియా పేరుతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 15 మంది సభ్యుల బృందాన్ని స్టార్టప్‌ ఇండియా పేరుతో భారత ప్రభుత్వం పంపింది. డైన్‌స్మార్ట్‌ పనితీరు భారత అధికారులను ఆకట్టుకుంది. దీంతో భారత ప్రభుత్వ అధికారులు దగ్గరుండి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. పోర్చుగల్‌లో ఉన్న భారత రాయబారి నందిని సింగ్లా డైన్‌స్మార్ట్‌ పనితీరు గురించి పోర్చుగల్‌ అధికారులకు వివరించారు. భవిష్యత్‌లో డైన్‌స్మార్ట్‌ స్టార్టప్‌కు ఉన్న మార్కెట్‌ను గుర్తించిన పోర్చుగల్‌ ప్రభుత్వం తమ ఇంక్యుబేషన్‌ సెంటర్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పోర్చుగల్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు డైన్‌స్మార్ట్‌ బృంద సభ్యులు ఫిబ్రవరి 20న వెళ్లనున్నారు.

ఆనందంగా ఉంది 
డైన్‌ స్మార్ట్‌ స్థాపించినప్పుడు ఇండియాలో మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకోగలం అని అనుకున్నాం. కానీ.. గ్లోబల్‌ మార్కెట్‌లో విస్తరిస్తామని అనుకోలేదు. ఇంత త్వరగా ఈ అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది.
– ఎల్లబోయిన తరుణ్, డైన్‌ స్మార్ట్‌ ఎండీ 
 

Read latest Warangal News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top