లండన్‌లో సింగ్‌ ఈజ్‌ 'కింగ్‌' !

Indian origin sikh man gets safe guard award - Sakshi

కిడ్నాపర్‌ నుంచి బాలికను కాపాడిన సత్‌బీర్‌ అరోరా

లండన్‌: భారత సంతతికి చెందిన సిక్కు డ్రైవర్‌ 13 ఏళ్ల బాలికను కాపాడి లండన్‌లో హీరో అయ్యారు. అపహరణకు గురైన బాలికను తన చాకచక్యంతో రక్షించారు సత్‌బీర్‌ అరోరా. ఈ ఏడాది ఫిబ్రవరి 20న తన క్యాబ్‌ను ఒకరు బుక్‌చేశారు. అయితే ఎప్పటిలానే అరోరా ప్యాసింజర్‌ను ఎక్కించుకోడానికి వెళ్లగా... అక్కడ స్కూలు యూనిఫాంలోఉన్న విద్యార్థిని ఉంది, ఆమెతో పాటు 24 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నాడు. ఇద్దరూ క్యాబ్‌లో ఎక్కారు. వీరి వ్యవహారం చూసి అరోరా మనసు ఎందుకో కీడు శంకించింది. కారులో ఎక్కిన వ్యక్తి ఆ బాలికను ఏం చేయబోతున్నాడో ఫోన్‌లో అవతలి వ్యక్తికి వివరించడాన్ని అరోరా గుర్తించారు.

అతని మాటల ద్వారా ఆ బాలిక కిడ్నాప్‌కు గురైందని గ్రహించారు. వెంటనే బాలిక గురించి తెలుసుకోమని తన భార్యకు ఫోన్‌ ద్వారా తెలియజేశారు. ఆమె మాటల ద్వారా బాలిక కిడ్నాప్‌కు గురైందని నిర్ధారించుకున్నారు. దీంతో దగ్గరలోని పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు అరోరా. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ కిడ్నాపర్‌ని అరెస్టు చేశారు. ఎంతో తెలివిగా బాలికను రక్షించినందుకు అరోరాకు ‘అవుట్‌ స్టాండింగ్‌ ఎచీవ్‌మెంట్‌ ఇన్‌ సేఫ్‌గార్డ్‌’  సర్టిఫికెట్‌ను అక్కడి జిల్లా కౌన్సిలర్‌ కీరోన్‌ మాలన్‌ అందించారు.

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top