
లాస్‌ఏంజెలెస్: అమెరికాలో నడి రోడ్డుపై ప్రాచీన యుద్ధ విద్యను ప్రదర్శించిన ఓ సిక్కు వ్యక్తిని అమెరికా పోలీసులు కాల్చిచంపారు. జూలై 13వ తేదీన చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని లాస్‌ఏంజెలెస్ పోలీసు విభాగం తాజాగా విడుదల చేయడంతో విషయం వెలుగులోకి వచి్చంది. లాస్‌ఏంజెలెస్‌లోని క్రిప్టో డాట్ కామ్ అరెనా వద్ద గుర్‌ప్రీత్ సింగ్(35) వేటకత్తిని పట్టుకుని తిప్పుతుండగా హెచ్చరించామని, లక్ష్య పెట్టకపోగా తమపైకి దాడికి యతి్నంచాడని పోలీసులు అంటున్నారు. ఈ క్రమంలో జరిపిన కాల్పుల్లో అతడు చనిపోయాడని చెబుతున్నారు.
పోలీసులు చెబుతున్న వేటకత్తి, పంజాబ్ ప్రాచీన యుద్ధ విద్యలో భాగమైన గట్కాలో వాడే రెండంచుల కత్తి. సిక్కు మత పరమైన, సాంస్కృతిక కార్యక్రమాలప్పుడు దీనిని ప్రదర్శిస్తుంటారు. అయితే, షార్టు, తలపాగాను ధరించిన ఓ వ్యక్తి రెండడుగుల పొడవైన కత్తితో బెదిరించాడంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో తమ సిబ్బంది రద్దీగా ఉండే ఆ ప్రాంతానికి వెళ్లారని పోలీసు విభాగం తెలిపింది.
‘కత్తిని నేలపై పడేసి, లొంగిపోవాలని పదేపదే కోరగా, నిరాకరించిన అతడు కత్తితో నాలుకను కోసుకునేందుకు యతి్నంచాడు. సమీపంలోకి చేరుకుంటున్న పోలీసులపైకి బాటిల్ విసిరి, తన కారులో అక్కడి నుంచి తప్పించుకునేందుకు యతి్నంచాడు. పోలీసులు వెంబడించగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ పలు వాహనాలను ఢీకొట్టాడు. వేగంతో వెళ్తూనే కారులో నుంచి కత్తిని చూబుతూ బెదిరించాడు. కత్తిని విసిరేందుకు యతి్నంచగా కాల్పులు జరపాల్సి వచ్చింది. బుల్లెట్ గాయాలైన అతడు అనంతరం ఆస్పత్రిలో కన్నుమూశాడు’అని పోలీసులు వివరించారు.