పరిణామం ఒకటి, పాఠాలెన్నో..!

పరిణామం ఒకటి, పాఠాలెన్నో..!


తమిళనాడుతో పోల్చిచూస్తే తెలుగు రాష్ట్రాల్లో పౌర సమాజం చేతన విరుద్ధంగా ఉంది. తమ జీవితాల్ని ప్రభావితం చేసే పలు కీలక విషయాల్లో పౌర సమాజం స్పందన సన్నగిల్లుతోంది. అధికారం గుప్పిటపట్టిన రాజకీయ, పాలనా వ్యవస్థలు తమ పబ్బం గడుపుకోవడానికి, ప్రజాచేతనను సన్నగిల్ల జేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. ముఖ్యంగా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థనూ గౌరవించని పాలకపక్షం వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అంతమాత్రాన అక్కడవి అసహజం కావు, అసాధారణం అంతకన్నా కావు.


గతించిన ఓ తమిళ మహానేత రాజకీయ వారసత్వం ఎవరిదన్న వివాదం పెను సంచలనం సృష్టించడం ఇదేం తొలిసారి కాదు. మూడోసారి! అన్నా దొరై నుంచి వారసత్వం నీదా–నాదా అన్న స్పర్ధ కరుణానిధి–నెడుంజెళియన్‌ మధ్య వస్తే, ఎమ్జీరామచంద్రన్‌ వారసురాలివి నువ్వా–నేనా అన్న తగాదా జానకీ, జయలలితల మధ్య వచ్చింది. ఇక జయలలిత రాజకీయ వారసత్వం ఎవరిదనే విషయంలో ప్రస్తుత గొడవ పన్నీరు సెల్వం–శశికళ మ«ధ్య అత్యంత వేగంగా పుట్టుకొచ్చింది. ఇప్పుడీ సంక్షోభం పతాకస్థాయి చేరింది. అన్ని సంద ర్భాల్లోనూ... అంతిమంగా వారసత్వాన్ని నిర్ణయించింది, భవిష్యత్తులో నిర్ణ యించబోయేది తమిళ ప్రజలు, స్థూలంగా చెప్పాలంటే తమిళ సమాజం. రాష్ట్ర–కేంద్ర స్థాయి రాజకీయ వ్యవస్థల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా జరుగుతున్న పరిణామమిది.భావోద్వేగాలను గరిష్ఠంగా ప్రకటించడంలో విలక్షణత చూపే తమిళ పౌరసమాజపు చైతన్యమే వేరు! ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, కేంద్రంలో సర్కారు నడుపుతున్న ఎన్డీయే, ముఖ్యంగా బీజేపీ నాయకత్వం ఈ సంక్లిష్టత నుంచి  ఏమాశిస్తోందన్నదే! ఏమీ ఆశించ కుండానే గవర్నర్‌ వ్యవస్థ ద్వారా రాజ్యాంగ ప్రక్రియలో కాలయాపనకు తలపడిందని అనుకోలేం. అలా అనుకోవాల్సి వస్తే, ప్రధానమంత్రి లేదా కేంద్ర అగ్రనాయకత్వం పురమాయింపు లేకుండానో, వారికి సమాచారం లేకుండానో అత్యవసర రాజ్యాంగ ప్రక్రియను సకాలంలో చేపట్టకుండా తమిళనాడు తాత్కాలిక గవర్నర్‌ తాత్సారం చేశారని అనుకోవాలి. అలా అను కునేంత అమాయకులెవరూ ఉండరు. బీజేపీ నాయకత్వం కూడా అమాయ కంగానే పావులు కదుపుతోందనీ అనుకోవడానికి లేదు.


ఎవరిదో ఇల్లు కాలు తుంటే ఆ మంటకు చలికాచుకోవాలనే తత్వం కాకపోవచ్చు కానీ, దీన్నొక  అవకాశంగా వాడుకొని ఎంతో కొంత రాజకీయ లబ్ధి పిండుకోవాలనే ఎత్తు గడ మాత్రం కనిపిస్తోంది. ఇవి లోగడ కాంగ్రెస్‌ నాయకత్వం చేయని యత్నాలు, వేయని ఎత్తుగడలేం కావు. వారా ప్రయోగాలు చేసి, వాటంగా చేయికాల్చుకొని, కడకు లాభం లేదని ప్రాంతీయశక్తులతో రాజీకి వచ్చిన బాపతే! ‘రాష్ట్ర రాజకీయాలు మీకు, ఢిల్లీ నంబర్లు మాక’ని స్థానిక ద్రవిడ పార్టీలతో కాంగ్రెస్‌ ఓ ఒప్పందానికి వచ్చిన నమూనా సుదీర్ఘకాలం సాగిందీ నేలపైన! నిన్నటి జల్లికట్టు సమస్య అయినా, నేటి రాజకీయ సంక్షోభమైనా, రేపటి మరో పరిస్థితయినా... తమిళ పౌరసమాజం నిర్ణాయక స్థితి అటు వంటిది. అందుకే, ఈ సంక్షోభం నుంచి కేంద్ర నాయకత్వం గ్రహించాల్సిన సూక్ష్మం, పొరుగునున్న రెండు తెలుగు రాష్ట్రాలు నేర్చుకోవాల్సిన గుణ పాఠాలు చాలానే ఉన్నాయి.తేలడానికి కొంత సమయం పట్టొచ్చు

అస్వస్థతకు గురై జయలలిత ఆస్పత్రి పాలయిన నుంచి బీజేపీ నాయకత్వం తమిళ రాజకీయ చదరంగంపై పావులు కదుపుతూనే ఉంది. ఆమె మరణ సమయానికి గూడుపుఠాణిగా మారిన  కేంద్ర సర్కారు పెద్దల తెరవెనుక ఎత్తులు ఎప్పటికప్పుడు లీలగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడవి తారస్థాయికి చేరాయి. ‘తాటి చెట్టెక్కావెందుకు?’ అంటే, ‘దూడగడ్డికోసం...!’ అన్నట్టు తడబాటు సమాధానాలిచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అప్పటివరకు ముఖ్య మంత్రిగా ఉన్న పన్నీరుసెల్వం రాజీనామా చేసి, ఏఐఏడీఎంకే శాసన సభాపక్షం శశికళను తమ నేతగా ఎన్నుకున్న తర్వాత గవర్నర్‌ అందుబాటు లోకి రాకపోవడం అనుచిత జాప్యమనే భావనలు, ఇంకా సందేహాలు వ్యక్తమై నాయి. ఈ జాప్యంలోంచి కొత్త పరిణామాలు పుట్టుకొచ్చాయి. అందులో ప్రధానమైంది, పన్నీరుసెల్వం తిరుగుబాటు. ఫలితంగా అన్నా డీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది. ఎవరికెంత బలం? అనే విషయంలో స్పష్టత లేక పోయినా రెండు శిబిరాల మధ్య దూరం పెరుగుతోంది. ఒక అనుచిత జాప్యం ఈ పరిణామాలన్నింటికీ తావిచ్చిందనే అభిప్రాయం సర్వత్రా ఉంది.గవర్నర్‌ అలా జాప్యం చేయడానికి సుప్రీంకోర్టులో ఉన్న పెండింగ్‌ కేసు వారంలో విచా రణకు రానుండటమేనని ఓ సంజాయిషీని ప్రచారంలోకి తెచ్చారు. సదరు అక్రమాస్తుల కేసులో శశికళ రెండో నిందితురాలిగా ఉన్నందునే గవర్నర్‌ వేచి చూసే ధోరణి అవలంబించారని వివరణ జోడిస్తున్నారు. ఇది రాజ్యాంగ బద్ధమా? అన్నది సందేహాస్పదమే! ఎట్టకేలకు గవర్నర్‌ గురువారం చెన్నైకి చేరిన పిదప చోటుచేసుకున్న పరిణామాల్లో మరింత వేగం పెరిగింది. ఇప్ప టికిప్పుడు శశికళ ముఖ్యమంత్రి అవుతారా? రాజీనామా వెనక్కి తీసుకొని పన్నీరు సెల్వం పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? సభ సుప్తచేత నావస్థలోకి వెళ్లి రాష్ట్రపతి పాలన వస్తుందా? అన్నవి పక్కన పెడితే జయలలిత నిజమైన రాజకీయ వారసులెవరనేది తేలడానికి కొంత సమయంపడుతుంది. దానికి అనేక కారణాలున్నాయి. తాజా పరిణామాల్లో... పార్టీ భవిష్యత్‌ నిర్వహణ అన్న కోణంలో ఎన్నికైన మెజారిటీ ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ వైపు చూస్తున్నారు. జయలలిత వారసురాలిగా శశికళను మెజారిటీ ప్రజానీకం అంగీకరించలేకపోవడం వల్ల నేమో ధిక్కార స్వరం తర్వాత పన్నీరు సెల్వంకు ప్రజాదరణ పెరుగుతోంది. నిజమైన వారసులెవరన్నది మళ్లీ తమిళ సమాజమే తేల్చాలి.వారసత్వం పక్కా చేయడమా? డీఎంకే నెత్తిన పాలుపోయడమా?

తమిళనాడు రాజకీయాలెరిగిన వారెవరైనా రాగల పరిణామాల్ని తేలిగ్గానే అంచనా వేయగలరు. ఒక అనిశ్చిత పరిస్థితిని సానుకూలంగా మలచుకోవ చ్చనే దూరదృష్టితో కేంద్రంలోని పాలకపక్షం బీజేపీ కొంత ‘పొలిటికల్‌ ఇంజనీరింగ్‌’కు పాల్పడ్డా, తద్వారా తాను నేరుగా పొందే లబ్ధి ఏమీ ఉండదు. ఈ పరిణామాల తర్వాత బీజేపీ వంటి జాతీయ పార్టీ తమిళనాట కొత్తగా బలోపేతమయ్యే ఆస్కారమే లేదనేది చరిత్ర చెప్పే సత్యం. శశికళకు సానుకూల వాతావరణం కల్పిస్తే, అన్నా డీఎంకే క్రమ క్రమంగా బలపడటం ఖాయం. అలా కాకుండా ఆమె అవకాశాల్ని నొక్కిపెట్టి, పన్నీరు సెల్వంకు సానుకూలంగా వ్యవహరిస్తే కాలక్రమంలో రాజకీయంగా ఆమె కనుమరు గయ్యే అవకాశాలుంటాయి.


పన్నీరు సెల్వం పార్టీని అంత పటిష్టంగా ముందుకు తీసుకువెళ్లగలరని అటు పార్టీ శ్రేణులు, ఇటు సామాన్య ప్రజలూ విశ్వసించడం లేదు. ఇది దీర్ఘకాలంలో డీఎంకేకి అనుకూలించే అంశం. అందుకే, బహిరంగంగా పన్నీరు సెల్వంకు మద్దతు మాటలు చెబుతూ పిల వని పేరంటంగా డీఎంకే తాజా సంక్షోభ బరిలోకి దూకుతోంది. శశికళను పక్కకు నెట్టి పన్నీరుసెల్వం ముఖ్యమంత్రిగా కొనసాగినా... తమకు ప్రయో జనమే తప్ప నష్టం లేదన్నది వారి లెక్క. ఎన్నికల రాజకీయాల నిర్వహణలో సెల్వం శక్తి–సామర్థ్యాలపై డీఎంకేకి స్పష్టమైన అంచనాలున్నాయి. ఈ విష యంలో అన్నా డీఎంకే పార్టీ నాయకులు, క్రియాశీల కార్యకర్తలకు కూడా విశ్వాసాన్ని మించిన సందేహాలున్నాయి. వ్యూహ–ప్రతివ్యూహాలతో, ఆర్థిక నిర్వహణతో రాగల ఎన్నికల్లో తమను పన్నీరు సెల్వం విజయతీరాలకు చేర్చ గలడన్న నమ్మకం వారికి  కుదరటం లేదు.పౌరసమాజం చేతనే రక్ష

తమిళనాడుతో పోల్చిచూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో పౌర సమాజం చేతన విరుద్ధంగా ఉంది. తమ జీవితాల్ని ప్రభావితం చేసే పలు కీలక విషయాల్లో పౌర సమాజం స్పందన ఇటీవల  సన్నగిల్లుతోంది. అధికారం గుప్పిటపట్టిన రాజకీయ, పాలనా వ్యవస్థలు తమ పబ్బం గడుపుకోవడానికి, ప్రజాచేతనను సన్నగిల్ల జేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. ముఖ్యంగా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థనూ గౌరవించని పాలకపక్షం వ్యవహార శైలిపై విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయిదేళ్లకు అధికారం ఉంది కనుక తమకిక అడ్డే లేదన్న ధోరణిలో ఆదినుంచీ ప్రభుత్వం, పాలకపక్షం వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంది.


ఎర్రచందనం తీవ్రవాదులంటూ తమిళ కూలీలను నిర్దాక్షిణ్యంగా కాల్చివేసిన ఘటన నుంచి రెండున్నరేళ్లలో ఎన్నో సందేహాస్పద పరిణామాల్లో ప్రభుత్వం ఏకపక్ష ధోరణి కొట్టొచ్చినట్టు కనిపించింది. భూసే కరణలో దోపిడీకే దిగింది. ‘దివీస్‌’ భూవివాదాల విషయంలో సర్కారు జరిపిన, కొనసాగిస్తున్న నిర్బంధ కాండ నుంచి నిన్నా ఇవ్వాళా అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో జరిగిన ఘాతుకాల వరకు దౌర్జన్యకాండకు అడ్డూ, అదుపూ లేదు. అనం తపురంలో తన హక్కుల విషయంలో గొంతెత్తిన ఓ మహిళను రోడ్డుకీడ్చి, సర్పంచి సహా పాలకపక్షీయుల దాడిచేసిన దుశ్శాసనపర్వాన్ని ప్రశ్నించిన వారు లేరు. చీరాలలో తమకు గిట్టని రాత రాశాడని ఓ జర్నలిస్టుపై పట్టపగలే అధికార తెలుగుదేశం ఎమ్మెల్యే సోదరుడు కర్రతో దాడి చేసి హత్యాయత్నం చేస్తే అడ్డుకున్న వారు లేరు. ఇటువంటి అరాచకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.


ప్రభుత్వం వైపు నుంచి బాధ్యత కలిగిన ఓ అధికారి గాని, రాజకీయ పెద్దలు గానీ కనీసం పెదవి విప్పరు. తమ ఆధిపత్యం కోసం రాష్ట్రమంతటికీ ఇవే సంకేతాలు వెళ్లాలన్నది వారి ఉద్దేశం కావచ్చు! ప్రతిపక్ష పార్టీ ఎత్తిచూపడం, ఎండగట్టడం తప్ప పౌరసమాజం తీవ్రంగా పరిగణించిన దాఖలాలే లేవు. సంప్రదాయంగా వస్తున్న ఓ సనాతన క్రీడ జల్లికట్టు నిషేదాన్ని ఎత్తివేయించుకొని, తమిళ సమాజం సదరు క్రీడను పునరుద్ధరించు కున్న తీరుకు అంతటా ప్రశంసలు లభించాయి. ఆ పరిస్థితిని, ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన ప్రత్యేక హోదా విషయమై జరిగిన అన్యాయంతో అనేక స్థాయిల్లో పోలికలు వచ్చాయి. ఇక్కడి ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ చూపట్లేదు, పైగా ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తోందన్న ప్రశ్నకు సమాధానం లేదు.రాజకీయ ప్రక్రియనూ నియంత్రించొచ్చు

పౌరసమాజం గళాన్ని చిన్నబుచ్చే పాలకపక్ష యత్నం తెలంగాణ రాష్ట్రం లోనూ జరుగుతోంది. ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను ఎవరు ప్రశ్నిం చినా సహించని తత్వం ప్రభుత్వ పెద్దల్లో  బలపడుతోంది. ఇదేమిటని ఎవరు గొంతెత్తినా అణచివేసే చర్యలకు పాల్పడటం ద్వారా పౌరసమాజాన్ని బలో పేతం కానీకుండా పైయెత్తులు వేస్తోంది. ప్రజాసమస్యలపై రాజకీయాలకతీ తంగా కోదండరామ్‌ వంటి వారు విమర్శిస్తే ముప్పేట దాడి చేస్తున్నారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీకి బాకా అయ్యావనో, అక్కడ చేరి క్రియాశీల రాజ కీయాల్లోకి రమ్మనో సలహాలిస్తున్నారు. రాజకీయ వేదికల నుంచి తప్ప మరో వేదిక నుంచి స్వరం వినిపించవద్దన్న పరోక్ష సంకేతాలిస్తూ పౌరసమాజాన్ని చిన్నబుచ్చుతున్నారు. విమలక్క గొంతు నొక్కడానికి ఆమె ప్రాతినిధ్యం వహి స్తున్న సంస్థ కార్యాలయానికే తాళం వేసింది.మన బలహీన సమాఖ్య విధాన లోపాలే ఆసరాగా సాగే కేంద్రం పెత్తనం నుంచి అవకాశవాద రాజకీయ స్వార్థాల నుంచి, పౌర సమాజ చేతనే రాష్ట్రాలకు రక్ష. స్థానిక అస్తిత్వ రాజకీయాలే తమకు ముఖ్యమని బీజేపీ వంటి జాతీయ పార్టీలకు పాఠం చెబుతోంది తమిళ పౌరసమాజం. రాజకీయ నిర్ణయాధికారాన్ని కూడా ప్రజాగళం ప్రభావితం చేయగలదని వివిధ స్థాయిల్లో నిరూపిస్తోంది. పొరుగునున్న తెలుగు రాష్ట్రాలకు స్ఫూర్తినిస్తోంది తమిళ సంఘటిత గళం. అదీ పౌరసమాజం బలం!ఈమెయిల్‌: dileepreddy@sakshi.com

దిలీప్‌ రెడ్డి

Back to Top