బంగారు బాతు 'నరసింహ'

బంగారు బాతు 'నరసింహ' - Sakshi


పత్తి వంగడం సంపాదన

ఏటా రూ. 5 వేల కోట్లు
!

     

20 ఏళ్లుగా ఎదురులేని నంద్యాల పత్తి వంగడం ‘నరసింహ’

1994లో దీన్ని రూపొందించిన ఘనత సీనియర్ విశారంత శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్‌దే

దేశవ్యాప్తంగా అన్ని కంపెనీల హైబ్రిడ్స్, బీటీ పత్తి విత్తనాలకు ఇదే మూలాధారం


 

వ్యవసాయ శాస్త్రవేత్త చేతి నుంచి విడుదలైన ఏ పత్తి వంగడం మనుగడైనా మహా అయితే ఐదేళ్లు. అప్పటికల్లా దీన్ని తలదన్నే మరో రకం వచ్చేస్తుంది. అయితే, ఏకంగా 20 ఏళ్లుగా వసివాడని నాన్ బీటీ పత్తి వంగడంగా ‘నరసింహ’(ఎన్.ఎ. 1325) రికార్డు సృష్టించింది! కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కాటన్ స్పెషలిస్ట్‌గా పనిచేసిన విశ్రాంత సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కాదరబాద్ రవీంద్రనాథ్ దీన్ని రూపొందించారు. 1994లో ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. నరసింహ సూటిరకం పత్తి విత్తనాలను 1995 జూన్ 12న అప్పటి ప్రధాన మంత్రి, నంద్యాల ఎంపీ కూడా అయిన పీ వీ నరసింహారావు రైతులకు తొలుత పంపిణీ చేశారు. అప్పటి నుంచి రైతుల ఆదరణ పొందుతున్న ఈ వంగడాన్ని దేశవ్యాప్తంగా అనేక కంపెనీలు విత్తనోత్పత్తి కోసం దీన్ని బేస్(పునాది)గా వాడుతుండడం విశేషం.‘నరసింహ’ తీరే వేరు!నంద్యాలలో 1936లో జన్మించిన రావీంద్రనాథ్ 1983లో నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌లో కాటన్ స్పెషలిస్ట్‌గా బాధ్యతలు చేపట్టారు. 10 మేలైన పత్తి వంగడాలను, రెండు హైబ్రిడ్ పత్తి రకాలను రూపొందించారు. సంకర జాతి రకాల్లో ఎన్‌హెచ్‌హెచ్ 390, అమెరికన్ రకాల్లో ప్రియ, నరసింహ, దేశవాళీ రకాల్లో శ్రీశైలం, అరవింద బాగా ప్రాచుర్యాన్ని పొందాయి.  అన్నిటికన్నా నరసింహ రకం ఇటు రైతులు.. అటు విత్తనోత్పత్తి కంపెనీల ఆదరణ పొందడం, అప్పటి నుంచి తిరుగులేని వంగడంగా మార్కెట్లో నిలవడం విశేషం.  నాణ్యమైన అధిక దిగుబడినివ్వడమే కాకుండా శనగ పచ్చ పురుగును కొంతవరకు తట్టుకునే శక్తి దీనికి ఉంది. ఎంసీయూ 5, ఎల్‌ఆర్‌ఏ 5166 కన్నా 20 శాతం అధిక దిగుబడినిస్తున్న నరసింహ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాగవుతోంది. ఈ పంట కాలపరిమితి 150 రోజులు. నల్లరేగడి నేలలతోపాటు నీటి వసతి ఉన్న ఎర్ర నేలలు, తేలికపాటి నేలల్లోనూ సాగు చేయొచ్చు. నీటి వసతి ఉంటే ఎకరానికి 15 క్వింటాళ్లు, నీటి వసతి లేకపోతే 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని డా. రవీంద్రనాథ్ తెలిపారు. మొదటి రెండుసార్లు తీసినప్పుడు ఎంత పత్తి దిగుబడి వచ్చిందో 3,4 సార్లు తీసినప్పుడూ ఆ స్థాయిలోనే పత్తి దిగుబడి రావడం దీనికున్న మరో ప్రత్యేకత అన్నారు. ఈ పత్తిలో దూది 37% ఉంటుంది. పోచ పొడవు 27.6 మి.మీ. ఉంటుంది. 40 కౌంట్ల దారం తీయడానికి అనువైనది. ఇన్ని మంచి లక్షణాలుండబట్టే దీన్ని తలదన్నే మరో నాన్ బీటీ పత్తి విత్తనం ఇప్పటికీ రాలేదు.లిఖితపూర్వకంగా కోరితే ‘నరసింహ’ విత్తనాలిస్తాం!అయితే, ప్రతి ఏటా కొనాల్సిన బీటీ పత్తి విత్తనాలు తప్ప.. తిరిగి వాడుకోవడానికి వీలైన నాన్‌బీటీ పత్తి విత్తనాలు మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో లేవు. నాన్‌బీటీ నరసింహ పత్తి విత్తనాలపై ఆసక్తి ఉన్న వారు నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసియేట్ డెరైక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా. వై. పద్మలత(99896 25208)ను సంప్రదించవచ్చు. రైతు బృందాలు లేదా సంస్థలు ఫిబ్రవరి, మార్చిలోగా తమను లిఖితపూర్వకంగా కోరితే యూనివర్సిటీ అనుమతితో వచ్చే ఖరీఫ్‌లో నరసింహ సూటిరకం విత్తనాలను ఉత్పత్తి చేసి ఇవ్వగలమని ఆమె తెలిపారు.       

     - గవిని శ్రీనివాసులు, కర్నూలు

 

‘నరసింహ’ను రూపొందించడం నా అదృష్టం!1994లో విడుదలైన ‘నరసింహ’ పత్తి వంగడం నేటికీఆదరణ పొందుతుండటం ఆనందదాయకం. కొత్త రకాలు సాధారణంగా నాలుగైదేళ్లకు కనుమరుగవుతుంటాయి. నరసింహ మాత్రం ఏటికేడాది అభివృద్ధి చెందుతుండటం విశేషం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న 80 శాతం హైబ్రిడ్ పత్తి రకాలకు నరసింహ ఆడ పేరెంట్‌గా వాడుతున్నారు. ఈ వంగడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపంలో ఏటా దాదాపు రూ. 5 వేల కోట్ల ఆదాయం వస్తున్నది. ఇటువంటి తిరుగులేని పత్తి వంగడాన్ని రూపొందించగలగడం నా అదృష్టం.     

- డా. కాదరబాద్ రవీంద్రనాథ్(99495 10008), విశ్రాంత సీనియర్ శాస్త్రవేత్త, నంద్యాల, కర్నూలు జిల్లా

 

 

 

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top