ఏయే పంటలను ఎలా విత్తుకోవాలి?

ఏయే పంటలను ఎలా విత్తుకోవాలి? - Sakshi


‘అన్నపూర్ణ’ ప్రకృతి వ్యవసాయ పంటల నమూనా ప్రకారం కందకాలు, మట్టి పరుపులు, కాలువలు, పండ్ల మొక్కలకు గుంతలు తవ్వడం.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలను గత వారం తెలుసుకున్నాం. ఇప్పుడు మట్టి పరుపుల్లో విత్తే పంటల గురించి తెలుసుకుందాం...అర ఎకరంలో అన్నపూర్ణ పంటల నమూనా కుటుంబ ఆహార భద్రత, ఆరోగ్య భద్రతకు ఉద్దేశించింది. కాబట్టి, అర ఎకరం(50 సెంట్ల) భూమిలో సిద్ధం చేసుకున్న మట్టి పరుపుల్లో అనేక రకాల ఆహార పంటలను విత్తుకునేలా ప్రణాళికలు వేసుకోవాలి. అర ఎకరంలోని అన్ని మట్టి పరుపుల్లోనూ నిర్ణీత దూరంలో పండ్ల మొక్కలు నాటుకోవాలి. ఆ తర్వాత ఒక పావు ఎకరంలోని మట్టి పరుపుల్లో కూరగాయ పంటలు, మిగతా పావు ఎకరంలోని మట్టి పరుపుల్లో తిండిగింజలు/పప్పులు/నూనెగింజల పంటలను విత్తుకోవాలి.



పండ్ల మొక్కలు: గట్టు నుంచి 6 అడుగుల స్థలం వదిలిపెట్టి పండ్ల మొక్కలు నాటాలి. తూర్పు నుంచి పడమరకు లేదా పడమర నుంచి తూర్పుకు ప్రతి ఐదో మట్టి పరుపు మధ్యలో మామిడి మొక్క నాటుకోవాలి. అంటే..1వ, 5వ, 9వ.. మట్టి పరుపుల్లో మామిడి మొక్కలు నాటాలి. మామిడి నుంచి 9 అడుగుల దూరంలో మునగ/ అరటి/బొప్పాయి/కరివేపాకు నాటాలి. మామిడి నుంచి 18 అడుగులకు జామ/నిమ్మ/సపోట/బత్తాయి/సీతాఫలం/ రామాఫలం/దానిమ్మ తది తర మొక్కలలో ఏదో ఒక రకం నాటుకోవాలి. దక్షిణం నుంచి ఉత్తరానికి లేదా ఉత్తరం నుంచి దక్షిణానికి మామిడి మొక్క నుంచి 36 అడుగులకు మళ్లీ మామిడి/పనస/ఉసిరి మొక్కల్లో ఏదో ఒక రకం మొక్కను మట్టి పరుపుల్లో నాటుకోవాలి. ఈ వరుసలో 18 అడుగులకు, 9 అడుగులకు ఎటువంటి పండ్ల మొక్కలు నాటకూడదు.



కూరగాయలు: కూరగాయల కోసం కేటాయించిన పావు ఎకరం(25 సెంట్ల)లో పండ్ల మొక్కలు నాటుకున్న మట్టి పరుపుల్లో దుంపజాతి/ ఆకుకూరలు పంట మార్పిడి విధానం పాటిస్తూ విత్తుకోవాలి. 2వ మట్టి పరుపులో ఆకుకూరలు 3, 4వ మట్టి పరుపుల్లో కాయగూరలు టమోటా/ వంగ/మిరప/కాలీఫ్లవర్/క్యాబేజీ/నూల్‌కోల్/నేలచిక్కుడు మొదలైన వాటిని వేసుకోవాలి. ఒక రకమైన పంట వేసిన మట్టి పరుపులో పంట తీసిన తరువాత అదేరకమైన పంట కాకుండా పంటను మారుస్తూ నాటుకోవాలి. దీని వలన ఒక పంటకు సోకిన పురుగులు, తెగుళ్లు తొందరగా పక్క పరుపు మీదకు వ్యాప్తి చెందకుండా అరికట్టగలుగుతాం.



 తిండి గింజలు/పప్పులు/నూనెగింజల పంటలు: మిగిలిన పావు ఎకరం భూమిలో పండ్ల మొక్కలు నాటుకున్న మట్టి పరుపుల్లో నీడ ఎక్కువ అవసరమైన దుంప జాతి, పప్పు జాతుల పంటలు విత్తుకోవాలి. పండ్ల మొక్కల్లేని మట్టి పరుపుల్లో చోడి/వరి/జొన్న/కొర్ర/సజ్జ/ఊదలు మొదలైన పంటలు లేదా నూనె జాతులైన నువ్వులు/వేరుశనగ/పొద్దుతిరుగుడు/అవిశె తదితర పంటలు లేదా పప్పు జాతు లైన పెసర/మినుము/ఉలవ/బొబ్బర్లు/ కొమ్ముశెనగ/ బఠాణి/అనుములు మొదలైనవి ఏక పంటగా లేదా కొన్ని పంటలు కలిపి విత్తుకోవాలి. ఒక మట్టి పరుపులో ఈ సీజన్‌లో వేసిన పంటలను వచ్చే సీజన్‌లో వేయకూడదు. పంటల మార్పిడి చేస్తూ వేరే రకం పంటలు వేసుకోవాలి.



 అంతర పంటలు వేసేదెలా?



1.ఎక్కువ పంటకాలం కలిగిన, ఎక్కువ ఎత్తు పెరిగే పంటల్లో తక్కువ పంట కాలం, తక్కువ ఎత్తు పెరిగే పంటలను విత్తుకోవడాన్ని లేదా ప్రధాన పంటకంటే ముందుగానే ఫలసాయమందించే, తక్కువ పంటకాలం కలిగిన పంటలను అంతర పంటలని అంటారు.2. కూర గాయల కోసం కేటాయించిన పావు ఎకరంలోని మట్టి పరుపుల్లో పండ్ల మొక్కలు నాటుకున్న తర్వాత సామ, కంద, ఉల్లి, కేరట్, బీట్‌రూట్, బంగాళాదుంపలు, పసుపు, అల్లం మొదలైన దుంప జాతులను అంతర పంటలుగా వేసుకోవాలి. ఏటా ఒక్కసారైనా పప్పు జాతుల పంటలను విత్తుకోవాలి. 3. పండ్ల మొక్కలు నాటుకున్న మట్టి పరుపుల్లో అల్లం, పసుపు, నేల పనసలతోపాటు పప్పు జాతులను తప్పనిసరిగా విత్తుకోవాలి.



అంతర పంటలు.. కంది: కందిలో అంతరపంటగా జొన్న, వేరుశనగ, రాగి, కొర్ర, పెసర, మినుము, ఉలవ, బొబ్బర్లు, నేలచిక్కుడు వేసుకోవచ్చు. జొన్న: వేరుశనగ, రాగి, కొర్ర, పెసర, మినుము, ఉలవ, బొబ్బర్లు, నేల చిక్కుడు మొదలైనవి. కొర్ర: వేరుశనగ, సోయాచిక్కుళ్లు, బొబ్బర్లు, పెసర, మినుము. బెండ: నూల్‌కోల్, క్యారెట్, టమోటా, క్యాబేజీ, కాలీఫ్లవర్, కొత్తిమీర, గోంగూర, తోటకూర, పాలకూర, ఉల్లి. వంగ: ఆకుకూరలు, నూల్‌కోల్, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉల్లి, వెల్లుల్లి. మిరప: ఆకుకూరలు, ఉల్లి, వెల్లుల్లి. నువ్వు: పెసర/మినుము/ఉలవ మొదలైన వాటిని విత్తుకోవచ్చు. అంతర పంటల్లో నేల వివిధ పంటలతో కప్పబడి ఉంటుంది. అంతర పంటల వల్ల ‘సజీవ ఆచ్ఛాదన’ ఏర్పడి నేలలో తేమ ఆరిపోకుండా ఉంటుంది. భూమి సారవంతమవుతుంది. ప్రకృతి వైపరీత్యాలకు ఒక పంట పోయినా 2వ పంట చేతికి వస్తుంది. రసాయనాల అవశేషాలు లేని ఆహారం లభిస్తుంది.



 (‘జట్టు’ సౌజన్యంతో.. వచ్చే వారం మరికొన్ని విషయాలు)

 - ‘సాగుబడి’ డెస్క్    


 

 అన్ని ప్రాంతాలకూ అనుకూలమైనదేనా?



అధిక (1000-1200 మి.మీ.) వర్షపాతం నమోదయ్యే ఉత్తరాంధ్రలో ‘అన్నపూర్ణ’ ప్రకృతి వ్యవసాయ పంటల నమూనాను మీరు అమలు చేస్తున్నారు. ఇంతకన్నా తక్కువ వర్షంపడే ఇతర ప్రాంతాలకు కూడా ఇది అనుకూలంగా ఉంటుందా?‘అన్నపూర్ణ’ పంటల నమూనా వర్షపాతం ఎక్కువ నమోదయ్యే ప్రాంతాలకన్నా తక్కువ వర్షం కురిసే ప్రాంతాలకే ఎక్కువ ఉపయోగకరం. అర ఎకరంలో ఏర్పాటు చేసిన కందకాలు, కాలువలు అత్యధిక వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేస్తాయి. వర్షపు నీరు వృథా కాదు. మట్టిపరుపుల చుట్టూ తవ్వే కందకం చుట్టుకొలత సుమారుగా 200 మీటర్లు (0.45 మీ. వెడల్పు, 0.30 మీ. లోతు). మట్టి పరుపుల మధ్య కాలువల పొడవు 616 మీటర్లు (0.60 మీ. వెడల్పు, 0.30 మీ. లోతు). కందకాలు (27.135 క్యూబిక్ మీటర్లు), కాలువల (110.88 క్యూబిక్ మీటర్లు) ద్వారా.. మొత్తం 138 క్యూబిక్ మీటర్ల గుంతల ద్వారా నీటిని భూమిలోకి ఇంకింపజేస్తున్నామన్న మాట. ఈ విధంగా భూగర్భ జలాలు పెంచుకొని మెరుగైన ఉత్పాదకత సాధించవచ్చు. వత్తుగా పంటలు వేయడం (సజీవ ఆచ్ఛాదన) వల్ల మట్టిలో తేమ త్వరగా ఆరిపోకుండా చూస్తున్నాం. కాబట్టి, వర్షపాతం తక్కువ ఉండే ప్రాంతాల్లోనూ ఈ నమూనాలో పంటలు సాగు చేయవచ్చు.



 - డి. పారినాయుడు (94401 64289),

  ‘జట్టు’ వ్యవస్థాపకులు, ‘అన్నపూర్ణ’ నమూనా రూపశిల్పి  

 శిక్షణ పొందగోరే రైతు సోదరులు, సంస్థలు సంప్రదించాల్సిన చిరునామా:

 జట్టు ఆశ్రమం, తోటపల్లి పోస్టు, రావి వలస(ఎస్.ఓ.), పార్వతీపురం వయా, విజయనగరం జిల్లా- 535525. ఫోన్: 08963 227228 (ఉ. 9 గం. నుంచి రాత్రి 8 గం. వరకు). ఎం. నూకంనాయుడు(ప్రాజెక్టు మేనేజర్)- 94400 94384

email;jattutrust1@gmail.com

 

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top