వారంలో 4 రోజులు సొంత కూరగాయలే!

4 days a week in their own vegetables! - Sakshi

నీత ప్రసాద్‌.. రెండేళ్లుగా ఇంటి మేడపైనే సేంద్రియ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను మక్కువతో సాగు చేసుకుంటున్నారు. సికింద్రాబాద్‌ ఘన్‌రాక్‌ ఎన్‌క్లేవ్‌ సెకండ్‌ ఫేజ్‌లో సొంత ఇండిపెండెంట్‌ హౌస్‌లో నివాసం ఉంటున్నారు.  స్వతహాగా బోన్సాయ్, పూల మొక్కలంటే ఆసక్తి చూపే నీత ప్రసాద్‌.. కొంతకాలం ఐటీ జాబ్‌ చేశారు. వెన్నునొప్పి కారణంగా ఉద్యోగం వదిలేసి.. సేంద్రియ ఇంటిపంటలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు.
 
టెర్రస్‌పై సుమారు 200 కుండీలు, గ్రోబాగ్స్‌లో కుటుంబంలో నలుగురికి వారానికి నాలుగు రోజులకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలతోపాటు.. 20 రకాల పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారు చేసుకొని ఇంటిపంటలకు వాడుతున్నారు. 

గోశాలలకు వెళ్లి ఆవు పేడ, మూత్రం తెచ్చుకొని.. ప్రతి 15 రోజులకోసారి స్వయంగా జీవామృతం తయారు చేసుకొని ఇంటిపంటలకు వినియోగించడం.. నగరంలో సహజాహారం సాగుపై ఆమెకున్న నిబద్ధతకు నిదర్శనంగా చెప్పొచ్చు. 

అంజూర, జామ, డ్రాగన్‌ ఫ్రూట్స్, దానిమ్మ, సపోటా.. తదితర రకాల పండ్లు పెద్ద కుండీలు, గ్రోబాగ్స్‌లో పండిస్తున్నారు. పాలకూర, తోటకూర, పొన్నగంటి కూర.. టమాటా, వంగ, దొండ, బీర, మిర్చి తదితర కూరగాయలను నీత ప్రసాద్‌(98490 31713) సాగు చేస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులకు వారంలో కనీసం 4 రోజులకు అవసరమైన ఆకుకూరలు, కూరగాయలను మేడపైనే ఆమె శ్రద్ధగా సాగు చేసుకోవడం అభినందనీయం.  

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top