
మంత్రి నారాయణను ఎందుకు అరెస్ట్ చేయరు?
నారాయణ కాలేజీ విద్యార్థుల ఆత్మహత్యలను టీడీపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు.
తిరుమల: నారాయణ కాలేజీ విద్యార్థుల ఆత్మహత్యలను టీడీపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. ఇప్పటివరకు 14 మంది నారాయణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. నారాయణ విద్యాసంస్థల యాజమాని మంత్రి నారాయణను ఎందుకు అరెస్ట్ చేయరని ఆమె ప్రశ్నించారు.
విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులైన యాజమాన్యాలపై కేసులు పెడతామన్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పుడెందుకు మాట్లాడడంలేదని నిలదీశారు. నారాయణ కాలేజీల కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవో ఏమైనా ఇచ్చిందా అని నిలదీశారు.
శుక్రవారం తిరుమలలో ఆమె విలేకరులతో మాట్లాడారు. పాలు, కూరగాయలతో కోట్లు సంపాదించే కిటుకెంటో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. హెరిటేజ్ కు పాలు అమ్మిన రైతులు ఎందుకు కోటీశ్వరులు కావడం లేదని సూటిగా అడిగారు. చంద్రబాబు చేసిన మోసంతో ఏపీలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు.