
'అమిత్ షాపై మరో ఛార్జిషీటు!
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై మరో ఛార్జిషీటు దాఖలు చేయడానికి ముజాఫర్ నగర్ పోలీసులు రంగం సిద్ధం చేశారు.
ముజఫర్ నగర్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై మరో ఛార్జిషీటు దాఖలు చేయడానికి ముజాఫర్ నగర్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. అంతకుముందు అమిత్ షా దాఖలైన ఛార్జిషీటులో లోపాల్ని ఎత్తిచూపుతూ ఉత్తరప్రదేశ్ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో తిరిగి మరో ఛార్జిషీటు దాఖలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి సీనియర్ పోలీస్ అధికారి హెచ్ ఎన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షాపై కొత్త ఛార్జిషీటును దాఖలు చేస్తామని..అందుకు గాను తగిన కసరత్తులు చేస్తున్నట్లు తెలిపారు. గత సాధారణ ఎన్నికల్లో అమిత్ షా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ వ్యాఖ్యలు చేసారంటూ దాఖలైన ఫిర్యాదుపై పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని గురువారం విచారణకు స్వీకరించిన కోర్టు.. నిబంధన ప్రకారం నిందితుడికి సంబంధించి వారంట్ గానీ, అనుబంధ విచారణకు గానీ పోలీసులు కోరలేదని కోర్టు తెలిపింది.
చార్జ్‌షీట్‌ను దాఖలు చేయడానికి ముందు నిందితుడిని అదుపులోనికి తీసుకోవడానికి ప్రయత్నించకుండా పోలీసులు సీఆర్‌పీసీ నిబంధన 173 (2)ను ఉల్లంఘించారని గురువారం స్థానిక అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సుందర్ లాల్ వ్యాఖ్యానించారు. ఐపీసీ 188 సెక్షన్ ప్రకారం పోలీసులు చార్జ్‌షీట్‌ను దాఖలు చేయకూడదన్న కోర్టు.. ఆ చార్జ్‌షీట్లో తప్పులు తొలగించడానికి తిప్పిపంపింది.