ఇండోనేషియాలోని మౌంట్ కెలుడ్ అగ్ని పర్వతం పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారని జాతీయ విపత్తు సంస్థ అధికార ప్రతినిధి శుక్రవారం జకార్తాలో వెల్లడించారు.
ఇండోనేషియా తూర్పు జావాలోని మౌంట్ కెలుడ్ అగ్ని పర్వతం గత అర్థరాత్రి పేలింది. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారని జాతీయ విపత్తు సంస్థ అధికార ప్రతినిధి శుక్రవారం జకార్తాలో వెల్లడించారు. ఆ పేలుడుదాటికి సమీపంలోని రెండు భవనాలు కుప్పకూలడంతో ఆ ఇద్దరు మృతి చెందారని చెప్పారు. ఆ అగ్ని పర్వత పరిసర ప్రాంతాల నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు దాదాపు లక్ష మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. గత అర్థరాతితో పోల్చుకుంటే పేలుడు ప్రభావం కాస్త తగ్గిందన్నారు.
అగ్ని పర్వతం పేలుడు కారణంగా దేశంలో దాదాపు ఆకాశమంతా బుడిదతో నిండిపోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో మూడు ఎయిర్పోర్ట్లను మూసివేసినట్లు ఇండోనేషియా రవాణాశాఖ మంత్రి తెలిపారు. విమాన సర్వీసులు కూడా చాలా మటుకు నిలిపివేసినట్లు చెప్పారు. ఇటీవల కాలంలో దేశంలో పేలిన అతిపెద్ద అగ్నిపర్వతం కెలుడ్ అని అధికారులు వెల్లడించారు. 1919లో కెలుడ్ అగ్ని పర్వతం విస్పోటంలో 55 మంది మరణించారని, అలాగే 2007లో కూడా ఆ అగ్ని పర్వతం పేలిందని తెలిపారు.


