ముగిసిన ‘మున్సిపల్’ ప్రచారం | Today Corporation elections polling | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘మున్సిపల్’ ప్రచారం

Mar 5 2016 1:55 AM | Updated on Sep 17 2018 6:08 PM

కొద్ది రోజులుగా మూడు జిల్లాల్లో రాజకీయ వేడి పుట్టించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం తెర పడింది.

వరంగల్, ఖమ్మం, అచ్చంపేటల్లో రేపే పోలింగ్
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజులుగా మూడు జిల్లాల్లో రాజకీయ వేడి పుట్టించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం తెర పడింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలను సవాలుగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పి రంగంలోకి దించింది. వరంగల్‌కు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఖమ్మంకు ఆ జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అచ్చంపేటకు మరో మంత్రి జూపల్లి కృష్ణారావు ఇన్‌చార్జిలుగా వ్యవహరించారు.

గ్రేటర్ వరంగల్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తదితరులు కూడా ప్రచారం చేశారు. రెండు నగరాల్లో టీఆర్‌ఎస్ విస్తృతంగా ప్రచారం చేపట్టింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో చివరి రెండు రోజుల్లో మున్సిపల్ మంత్రి కేటీఆర్ సుడిగాలి ప్రచారం జరిపారు.
 
విపక్షాలు కూడా..: అధికార పార్టీని మూడు చోట్లా ఓడించి తమకు అవకాశం ఇవ్వాలంటూ విపక్ష పార్టీలు ప్రచారం చేసుకున్నాయి. వరంగల్‌లో ఈసారి బీజేపీ, టీ టీడీపీలు పొత్తుకు దూరంగా ఉండి విడివిడిగా బరిలో దిగాయి. పరస్పరం విమర్శలు కూడా గుప్పించుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు వరంగల్ ఎన్నికల ప్రచారంలో పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఖమ్మంలో కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తమ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. అచ్చంపేటలో టీఆర్‌ఎస్‌కు దీటుగా కాంగ్రెస్ ప్రచారం చేసింది. మాజీ మంత్రి డి.కె.అరుణ ప్రచారంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement