నైజీరియాలో ఖైదీలుగా ఉన్న మహబూబ్‌నగర్‌కు చెందిన మనోజ్ కుమార్ సహా మరో 11 మంది విడుదలకు జోక్యం .....
సుష్మా స్వరాజ్‌ను కోరిన నైజీరియా ఖైదీల కుటుంబసభ్యులు
న్యూఢిల్లీ: నైజీరియాలో ఖైదీలుగా ఉన్న మహబూబ్‌నగర్‌కు చెందిన మనోజ్ కుమార్ సహా మరో 11 మంది విడుదలకు జోక్యం చేసుకోవాలని బాధితుల కుటుంబసభ్యులు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. మనోజ్‌కుమార్ తండ్రి దశరథ్‌తో పాటు బాధిత ఖైదీల కుటుంబసభ్యులు మంగళవారం మంత్రిని కలసి వినతి పత్రం అందజేశారు. ఏడాది నుంచి తమవారిని నైజీరియా జైలులో బంధించారని, వారిని విడుదల చేయించి తమకు అప్పచెప్పాలని విన్నవించారు.
అక్టోబర్ 12న అక్కడి న్యాయస్థానంలో కేసు విచారణ జరగనుందని, అప్పటి వరకు ఎలాంటి ప్రక్రియ చేయలేమని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. కోర్టు తీర్పుననుసరించి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు దశరథ్ పేర్కొన్నారు. ఖైదీలకు వైద్యం, ఇతరత్రా ఖర్చులు, న్యాయసలహాలను నైజీరియాలోని భారత రాయబార కార్యాలయం చూసుకుంటోందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మంత్రి చెప్పినట్లు వివరించారు