పశ్చిమబెంగాల్లో ఓ విద్యార్థిని ఇనుప స్కేలుతో కొట్టినందుకు ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పశ్చిమబెంగాల్లో ఓ విద్యార్థిని ఇనుప స్కేలుతో కొట్టినందుకు ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన కోల్కతాకు 15 కిలోమీటర్ల దూరంలో హౌరా జిల్లాలో జరిగింది. తమ అబ్బాయి పక్కనే ఉన్న క్లాస్మేట్ను పెన్ను అడిగి తీసుకుంటుండగా, హిందీ టీచర్ దూరం నుంచి ఇనుప స్కేలును విసిరేశారని, క్లాసులో ఎందుకు మాట్లాడతావంటూ కోపంగా తిట్టారని అతడి తల్లిదండ్రులు తెలిపారు.
స్కేలు బాగా గట్టిగా తగలడంతో తమ అబ్బాయి స్పృహతప్పి పడిపోయాడని, దాంతో స్కూలు వర్గాలు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాయని చెప్పారు. అక్కడ చికిత్స చేసి పిల్లాడిని ఇంటికి పంపేశారు. మర్నాటి ఉదయం విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. పిల్లాడు బాగా భయపడిపోయాడని, ఇప్పుడు స్కూలుకు కూడా వెళ్లనని చెబుతున్నాడని కుటుంబ సభ్యులు అంటున్నారు.