విమానాల్లో వచ్చి ‘టకీ’మని చోరీలు..!

విమానాల్లో వచ్చి ‘టకీ’మని చోరీలు..! - Sakshi


సాక్షి, హైదరాబాద్: అతడు చదివింది మూడో తరగతి వరకే.. చదువు అబ్బకపోవడంతో రోడ్డుపక్కన కళ్లద్దాలు అమ్మాడు.. రెండు పెళ్లిళ్లు.. ఆర్థిక ఇబ్బందులు.. అప్పులు.. అన్నీ నెత్తినపడటంతో ఈజీ మనీపై కన్నేసి దొంగతనాల బాట పట్టాడు. ఇప్పుడు చోరీలు చేసేందుకు  విమానాల్లోనే చక్కర్లు కొడుతున్నాడు. సైబరాబాద్ పోలీసులకు చిక్కిన ఇరానీ గ్యాంగ్ నాయకుడు టకీ అలీ నేపథ్యం ఇదీ. టకీకి సోదరుడైన సల్మాన్ బంగారు గొలుసులు లాగడంలో మాత్రం దిట్ట.

 

లగ్జరీ లైఫ్ కోసం..

కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన టకీ అలీ, సల్మాన్ అలీ తండ్రి ఒక్కరే సర్దార్ యూసుఫ్ అలీ. అయితే తల్లులు మాత్రం వేరు. యూసుఫ్ అలీకి ముగ్గురు భార్యలు, 18 మంది పిల్లలు. రెండో భార్య కశ్మీరీ బేగంకు టకీ అలీ నాలుగో కుమారుడు. బీదర్‌లోని సలాభాను ప్రైమరీ స్కూల్‌లో మూడో తరగతి వరకు చదువుకున్నాడు. చదువుపై ఇష్టంలేక రోడ్లపక్క కళ్లద్దాలు విక్రయించేవాడు.



ముంబైలోని యాంబీవాలీకి చెందిన ఫిజాని పెళ్లి చేసుకున్నాడు. వీరికి మహమ్మూద్(9) అనే కుమారుడు ఉన్నాడు. 2008లో సుకైనాని రెండో పెళ్లి చేసుకున్నాడు. పెద్ద కుటుంబం కావడం, లగ్జరీ లైఫ్‌కు అలవాటుపడటంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. దీంతో సన్నిహితుల వద్ద అప్పులు చేశాడు. వీటిని తీర్చలేక నేరాలబాట పట్టాడు.

 

అందరూ బంధువులే..


సల్మాన్ అలీతో కలసి 2008లో ముఠాగా ఏర్పడ్డారు. వీరికి మరో ఏడుగురు తోడయ్యారు. వీరంతా దగ్గరి బంధువులే. బైక్ నడపడంలో సిద్ధహస్తులైన టకీ, సల్మాన్ తొలుత ఢిల్లీ, బెంగళూరుల్లో అటెన్షన్ డైవర్షన్, చైన్ స్నాచింగ్ చేశారు. బీదర్‌లో స్నూకర్ బిజినెస్ చేస్తున్న రాధే, గులామ్, అబ్బాస్, మెందిని కూడా తనవైపునకు తిప్పుకున్నాడు.



వీరు చోరీలు చేయాలనుకునే నగరాలకు ముందుగానే వెళ్లి అక్కడ బైక్‌లను దొంగతనం చేసి రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో పార్క్ చేసి టకీ, సల్మాన్‌లకు సమాచారం ఇచ్చేవారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ విమానాల్లో అక్కడికి చేరుకుని ఒక్క రోజులోనే ఏడెనిమిది స్నాచింగ్‌లు చేసి బైక్‌లను వదిలేసి వెళ్లిపోయేవారు. హైదరాబాద్‌లో  2012 నుంచి జంట పోలీస్ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 189 చోరీలకు పాల్పడ్డారు.

 

అబూబకర్‌కు స్నేహితులు..

నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులకు 4 నెలల క్రితం చిక్కిన అబూబకర్‌కు టకీ, సల్మాన్ స్నేహితులు. మరో ముఠా నాయకుడైన అబూబకర్‌ను కలిసేందుకు టకీ వస్తున్నాడన్న సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులు అక్కడికెళ్లారు. అయితే అప్పటికే అబూబకర్‌ను హైదరాబాద్ పోలీసులు పట్టుకోవడంతో టకీ అక్కడికి రాలేదు.



చివరకు టకీ గ్యాంగ్ సభ్యులు వాడిన సెల్‌ఫోన్ ఆధారంగా అతడి కొత్త నంబర్‌ను కనుగొన్న పోలీసులు అతడిని పట్టుకునేందుకు నెల క్రితం ఢిల్లీ వెళ్లారు. ఓ షాపింగ్ మాల్ కారు పార్కింగ్‌లో వాహనం ఎక్కుతున్న టకీని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి.. కారు నంబర్ ఆధారంగా అతడు ఉంటున్న ప్రాంతానికి వెళ్లి అక్కడి అపార్ట్‌మెంట్ యజమాని సహకారంతో టకీని పట్టుకున్నారు. ఆ తర్వాత జైపూర్‌లో స్నాచింగ్‌కు వస్తున్నానని టకీతోనే చెప్పించి సల్మాన్‌ని రప్పించి అరెస్ట్ చేశారు. తర్వాత వారిద్దరిని ప్రత్యేక వాహనంలో నగరానికి తీసుకొచ్చారు. వీరిని పీటీ వారంట్‌పై తీసుకునేందుకు నగర పోలీసులు సిద్ధమవుతున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top