స్వైన్‌ఫ్లూకు ‘ప్రైవేట్’లో ఉచిత సేవలు

స్వైన్‌ఫ్లూకు ‘ప్రైవేట్’లో ఉచిత సేవలు - Sakshi


* ఉచితంగా పరీక్షలు, మందులు ఇవ్వాలని సర్కారు నిర్ణయం

* అనుమానితులకు తక్షణమే చికిత్స అందించాలని ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ, డెంగీ జ్వరాలు నగరవాసులను బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో స్వైన్‌ఫ్లూ చికిత్స కోసం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరే రోగులకు ఉచితంగా పరీక్షలు, మందులు అందజేయాలని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశించింది. స్వైన్‌ఫ్లూ అనుమానితులకు రక్తపరీక్షలు చేసే వరకు ఆగకుండా వెంటనే చికిత్స ప్రారంభించాలని సూచించింది.‘స్వైన్‌ఫ్లూ పరీక్షలను తప్పనిసరిగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)లోనే చేయించాలి. ఈ పరీక్షలన్నింటినీ ఉచితంగానే నిర్వహిస్తారు. అవసరమైన మందులను ప్రభుత్వమే ఉచితంగా ఇస్తున్నందున కార్పొరేట్ ఆసుపత్రులు ఉచితంగా ఇవ్వాలి’ అని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది స్వైన్‌ఫ్లూ రోగులను ప్రైవేట్ ఆసుపత్రులు నిలువు దోపిడీ చేయడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. స్వైన్ ఫ్లూ పరీక్ష చేయాలంటే రూ. 3,500 ఖర్చు అవుతుండడంతో ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వమే ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తోంది.ఐపీఎంలో పరీక్ష చేసినట్లుగా ఇచ్చిన పత్రాలను కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందజేసి స్వైన్‌ఫ్లూ బాధితులు ఉచిత వైద్యం పొందవచ్చని సూచించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహించే ఇతరత్రా వైద్య చికిత్సలతో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేసింది.

 

ఆదివారాలు, సెలవుల్లోనూ ఐపీఎంలో పరీక్షలు

ఐపీఎంను ఆదివారాలు, సెలవుల్లోనూ ఒకపూట తెరిచి ఉంచాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. స్వైన్‌ఫ్లూ బాధితులకు హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్, అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. బోధనాసుపత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెలలో ఇప్పటివరకు 25 మందికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయిందని, ఇద్దరు చనిపోయారని వివరించారు. స్వైన్‌ఫ్లూ బారిన పడకుండా ప్రజలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. జ్వరపీడితులు జనసమ్మర్థంలోకి రాకూడదని, కరచాలనం చేయొద్దని, తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. రామంతాపూర్‌లోని హోమియో ఆసుపత్రిలోనూ హోమియో మందులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top