మండుతున్న ఉత్తర భారతం

మండుతున్న ఉత్తర భారతం - Sakshi


 లక్నో:  భానుడి భగభగలతో ఉత్తర భారతం మండిపోతూనే ఉంది. భరించలేని ఉష్ణోగ్రత. వేడిగాలులకు గంటల తరబడి విద్యుత్ కోతలు తోడవడంతో ఉత్తరప్రదేశ్‌లో ప్రజలు అల్లాడుతున్నారు.  లక్నోలో శనివారం 47 డిగ్రీలు, అలహాబాద్‌లో 48.3 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మీరట్, వారణాసి సహా దాదాపు రాష్ట్రమంతా అత్యధిక ఉష్ణోగ్రతలే నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.



యూపీలోని గ్రామాల్లో 2 నుంచి 3 గంటలు, పట్టణాల్లో 10 - 12 గంటల పాటు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. విద్యుత్‌ కోతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలుచోట్ల ప్రజలు విధ్వంసానికి దిగారు. లక్నో దగ్గర్లోని ఒక సబ్‌స్టేషన్‌పై దాడిచేశారు. పలువురు ఉద్యోగస్తులను నిర్బంధించారు. గోరఖ్‌పూర్, గోండ ప్రాంతాల్లో సబ్‌స్టేషన్లను తగలబెట్టారు. మరో వారం పాటు వాతావరణ పరిస్థితుల్లో పెద్ద మార్పేమీ ఉండకపోవచ్చని వాతావరణ శాఖ ప్రాంతీయాధికారి జేపీ గుప్తా వెల్లడించారు. రుతుపవనాల ఆగమనం ముందు కురిసే చిరుజల్లులకు కూడా అవకాశం కనిపించడంలేదన్నారు. 


మరోవైపు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. వాటికితోడు వేడి గాలులు తీవ్రస్థాయిలో వీస్తున్నాయి. దాంతో ప్రజల బాధలు వర్ణణాతీతం. విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్లోకి కొన్ని ప్రాంతాలలో శనివారం తేలికపాటి వర్షాలు కురిశాయని నాగపూర్లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top