వ్యాపార నిబంధనలు సరళం | Streamline business regulations | Sakshi
Sakshi News home page

వ్యాపార నిబంధనలు సరళం

Apr 30 2015 2:25 AM | Updated on Aug 15 2018 7:07 PM

వ్యాపార నిబంధనలు సరళం - Sakshi

వ్యాపార నిబంధనలు సరళం

భారత్‌లో వ్యాపార కార్యకలాపాలను మరింత సులువు చేసేవిధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

కంపెనీల చట్టానికి మరోసారి సవరణలు...
కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర...
 
న్యూఢిల్లీ : భారత్‌లో వ్యాపార కార్యకలాపాలను మరింత సులువు చేసేవిధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా కంపెనీల చట్టం-2013లో సవరణ ప్రతిపాదనలకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) బుదవారం ఆమోదం తెలిపింది. దేశంలో కొత్తగా ఏదైనా కంపెనీ లేదా సంస్థ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు లేదా రుణ సమీకరణకు ముందు తప్పనిసరిగా ప్రభుత్వానికి డిక్లరేషన్‌ను సమర్పించాలన్న నిబంధనను కంపెనీల చట్టం నుంచి తొలగించాలన్నది తాజా సవరణల్లో ప్రధానమైనది.

కాగా, మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక కంపెనీల చట్టంలో రెండోసారి సవరణ జరుగుతుండటం గమనార్హం. అదేవిధంగా ఈ చట్టంలోని నిబంధనల నుంచి మినహాయింపులు లేదా మార్పుచేర్పులకు సంబంధించి తుది ఉత్తర్వులను వేగవంతం చేసేందుకు వీలుకల్పించే ప్రతిపాదనలు కూడా కొత్త సవరణల్లో ఉన్నాయి. కేబినెట్ ఆమోదించిన ఈ ప్రతిపాదనలను కంపెనీల చట్టం(సవరణ) బిల్లు-2014లో చేర్చనున్నారు.

దీనికి గతేడాది డిసెంబర్‌లో లోక్‌సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం వ్యాపారాలకు అత్యంత అనువైన దేశాల్లో భారత్ 142వ స్థానంలో ఉందని.. దీన్ని టాప్-50 లోకి తీసుకురావడమే లక్ష్యంగా అనేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

గ్యాస్ క్షేత్రాల అభివృద్ధికి కొత్త పాలసీ...

సహజవాయువు నిక్షేపాల వెలికితీత, క్షేత్రాల అభివృద్ధి విషయంలో కంపెనీలకు వెసులుబాటు కల్పించేందుకు ఉద్దేశించిన కొత్త పాలసీకి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనివల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీలకు చెందిన 12 సమస్యాత్మక గ్యాస్ క్షేత్రాల(కేజీ-డీ6 సహా) అభివృద్ధికి మార్గం సుగమం కానుంది. ఈ క్షేత్రాల్లో నిక్షేపాల విలువ ప్రస్తుత ధరల ప్రకారం దాదాపు రూ. లక్ష కోట్లుగా అంచనా. కంపెనీలు తమ వద్దనున్న క్షేత్రాలను సొంత రిస్కులతో అభివృద్ధి చేసుకోవడానికి కొత్త పాలసీ అనుమతిస్తుంది.

అదేవిధంగా నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) నిర్దేశించినట్లుగా క్షేత్రాల అభివృద్ధికి ముందు నిక్షేపాల ధ్రువీకరణ పరీక్షలన్నీ చేసి.. ఆ తర్వాత అందుకయ్యే మొత్తం వ్యయాన్ని ఆదాయాల నుంచి వెనక్కితీసుకోవడానికి వీలయ్యే ఆప్షన్‌ను కూడా పాలసీ కల్పిస్తుంది. డీజీహెచ్ క్లియరెన్సులు లేక నిలిచిపోయిన 12 గ్యాస్ క్షేత్రాల్లో ఆరు రిలయన్స్‌వి కాగా, 5 ఓఎన్‌జీసీకి చెందినవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement