అనుకున్నంతా అయ్యింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే సీమాంధ్ర ప్రాంత ఎంపీలు తమ గళం విప్పారు.
అనుకున్నంతా అయ్యింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే సీమాంధ్ర ప్రాంత ఎంపీలు తమ గళం విప్పారు. ఉభయ సభల్లోనూ వారు నిరసన తెలియజేయడంతో రాజ్యసభ, లోక్ సభ రెండూ వాయిదా పడ్డాయి. రాజ్యసభ అయితే రెండుసార్లు వాయిదా పడింది. లోక్సభలో కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ప్రసంగిస్తున్న సమయంలో తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా నినదించారు. విభజనను వారు గట్టిగా వ్యతిరేకించారు.
సమైక్య సెగ పార్లమెంట్‌ను పూర్తిస్థాయిలో తాకింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే ఉభయసభలు రాష్ట్ర విభజన అంశంపై హోరెత్తాయి. ఉదయం లోక్‌సభ ప్రారంభమైన తర్వాత సభలో ఒకవైపు తెలంగాణ, మరోవైపు సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు హోరెత్తాయి. సీమాంధ్ర ఎంపీలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభ కార్యకలాపాలను అడ్డుకున్నారు. అయితే అదే సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం మౌనంగా కూర్చున్నారు. రాజ్యసభలో కూడా ఇవే పరిణామాలు చోటుచేసుకున్నాయి. సమైక్యాంధ్ర నినాదాలు హోరెత్తడంతో ఛైర్మన్ హమీద్ అన్సారీ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
అంతకుముందు... ఇటీవల రాజ్యసభ, లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ప్రమాణస్వీకారం చేయించారు. అదేవిధంగా ఇటీవలే కొత్త మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తులను ప్రధాని మన్మోహన్ సభకు పరిచయం చేశారు. ఇటీవల నక్సల్స్ దాడిలో మృతిచెందిన కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా, కాంగ్రెస్ నేత మహేంద్రకర్మ తదితర నాయకులకు ఉభయసభలు సంతాపం తెలిపాయి.