ఆ హత్య చేసింది మేమే.. కాదు మేమే! | rival group gangsters fight over claim of rocky's murder | Sakshi
Sakshi News home page

ఆ హత్య చేసింది మేమే.. కాదు మేమే!

May 5 2016 6:16 PM | Updated on Jul 26 2018 5:23 PM

ఆ హత్య చేసింది మేమే.. కాదు మేమే! - Sakshi

ఆ హత్య చేసింది మేమే.. కాదు మేమే!

పంజాబ్‌లో ఈ మధ్య జస్వీందర్ భుల్లర్ అలియాస్ రాకీ అనే గ్యాంగ్‌స్టర్ హత్యకు గురయ్యాడు. అతడిని చంపింది మేమంటే మేమంటూ అతడి ప్రత్యర్థులు క్రెడిట్ కోసం కొట్టుకుంటున్నారు.

సాధారణంగా ఏదైనా హత్య జరిగినప్పుడు అది మేం చేయలేదంటే దాంతో మాకు సంబంధం లేదని అందరూ తప్పుకొంటూ ఉంటారు. పంజాబ్‌లో ఈ మధ్య జస్వీందర్ భుల్లర్ అలియాస్ రాకీ అనే గ్యాంగ్‌స్టర్ హత్యకు గురయ్యాడు. ఈ విషయంలో మాత్రం రాకీని చంపింది మేమంటే మేమంటూ అతడి ప్రత్యర్థులు క్రెడిట్ కోసం కొట్టుకుంటున్నారు. అది కూడా జైలు నుంచి ఫేస్‌బుక్‌లో తెగ అప్‌డేట్లు పెట్టేస్తున్నారు. పంజాబ్‌లోని వివిధ జైళ్లలో ఉన్న గ్యాంగ్‌స్టర్లతో పాటు.. పరారీలో ఉన్న వాళ్లలో కూడా చాలామంది ఈ హత్యకు క్రెడిట్ కొట్టేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసిన రాకీని.. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో హత్యకు గురయ్యాడు. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపారు. షేరా ఖుబ్బన్, సన్నీ చంద్ భాన్ గ్రూపులు అతడిని తామే హతమార్చామంటూ ఫేస్‌బుక్‌లో కామెంట్ల యుద్ధం మొదలుపెట్టాయి. రాకీని చంపింది తానేనని జైపాల్ సింగ్ అనే గ్యాంగ్‌స్టర్ ఏకంగా పెద్ద పోస్టు ఫేస్‌బుక్‌లో పెట్టాడు. డింపీ చంద్‌భాన్ కొడుకే రాకీని చంపినట్లు కొందరు చెబుతున్నారని, కానీ తన తండ్రి హత్య గురించి కనీసం ప్రకటన కూడా చేయలేని వ్యక్తి రాకీని ఎలా చంపుతాడని ఎద్దేవా చేశాడు.

కానీ సన్నీ చంద్‌భాన్ గ్రూపునకు చెందిన సందీప్ యాదవ్ అనే మరో గ్యాంగ్‌స్టర్ మాత్రం.. సన్నీ కొడుకు డింపీయే రాకీని చంపాడని చెబుతున్నాడు. దీంతో ఇప్పుడు రాకీ హత్యకేసులో ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని అరెస్టు చేయాలోనని తెలియక పోలీసులు తల పట్టుకుంటున్నారు. పనిలో పనిగా.. ఫేస్‌బుక్ కామెంట్లు చేస్తున్న గ్యాంగ్‌స్టర్ల ఆచూకీ కూడా కనుగొని వాళ్లను అరెస్టు చేస్తే ఎలా ఉంటుంనద్న ఆలోచన కూడా పోలీసులకు వస్తోందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement