
రాహుల్.. వచ్చేశాడు!!
ఇదిగో వస్తాడు... అదిగో వచ్చేస్తున్నాడని రెండు నెలలుగా ఊరిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు ఢిల్లీకి వచ్చాడు.
ఇదిగో వస్తాడు... అదిగో వచ్చేస్తున్నాడని రెండు నెలలుగా ఊరిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు ఢిల్లీకి వచ్చాడు. బుధవారం సాయంత్రం తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అత్యంత కీలకమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఉన్నట్టుండి తాను సెలవు తీసుకుంటానని చెప్పి, ఎక్కడికో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన రాహుల్ గాంధీ.. ఏకంగా రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ హస్తినాపురిలో అడుగుపెట్టాడు. రాహుల్ గాంధీని చూసేందుకు ఆయన తల్లి సోనియా గాంధీ గురువారం ఉదయం రాహుల్ ఇంటికి వెళ్లారు.
అంతకుముందు తమ వైఫల్యాల గురించి ప్రశ్నించడం తర్వాత.. ముందు రాహుల్ గాంధీ ఎక్కడున్నాడో వెతుక్కోవాలంటూ బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా కూడా చేశారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అమేథీ వెళ్లినప్పుడు కూడా అక్కడి ప్రజలు రాహుల్ గాంధీ ఎప్పుడొస్తారని అడిగారు. ఈనెల 19వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలతో కలిపి భారీ ఎత్తున రైతు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాలని తలపెట్టింది. దానికి ముందుగానే రాహుల్ను రప్పించాలన్న ప్రయత్నాలు ఎట్టకేలకు సఫలమయ్యాయి.