
ఆ హింస వెనుక పార్టీలు
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్న మతఘర్షణల వెనుక కొన్ని రాజకీయ పార్టీల హస్తం ఉండొచ్చని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్న మతఘర్షణల వెనుక కొన్ని రాజకీయ పార్టీల హస్తం ఉండొచ్చని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే పేర్కొన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో మరిన్ని మతఘర్షణలు జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. ‘ముజఫర్‌నగర్ హింసపై పూర్తి నివేదికలు అందేవరకు నేను రాజకీయ కుట్రల గురించి మాట్లాడను. అయితే ఘర్షణల్లో రాజకీయ పార్టీల ప్రమేయం ఉంది’ అని బుధవారమిక్కడ విలేకర్లతో అన్నారు. ఎన్నికల నేపథ్యంలో మతహింస జరిగే అవకాశాలున్నాయని 11 రాష్ట్రాలను అప్రమత్తం చేశామన్నారు.
ఎస్పీ, బీజేపీ పరస్పర విమర్శలు..
లక్నో/ఆగ్రా: ముజఫర్‌నగర్ ఘర్షణలపై బీజేపీ, ఎస్పీలు పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నాయి. బీజేపీ యూపీలో నరేంద్ర మోడీ తరహా ‘గుజరాత్ పాలన’ కోసం, మతసామరస్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని ఎస్పీ సీనియర్ నేత అబూ ఆసీం అజీ ఆరోపించారు. అల్లర్లకు ఎస్పీదే బాధ్యతని బీజేపీ ప్రతినిధులు సుధాంశు త్రివేదీ, విజయ్ పట్నాయక్‌లు ఆరోపించారు. మరోపక్క.. యూపీలోని ఎస్పీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని పలు ముస్లిం సంఘాలు ఢిల్లీలో డిమాండ్ చేశాయి.