‘ఉగ్ర’పోరులో కలసిరండి! | PM modi call for ASEAN countries | Sakshi
Sakshi News home page

‘ఉగ్ర’పోరులో కలసిరండి!

Nov 22 2015 1:09 AM | Updated on Aug 15 2018 6:32 PM

‘ఉగ్ర’పోరులో కలసిరండి! - Sakshi

‘ఉగ్ర’పోరులో కలసిరండి!

అంతర్జాతీయంగా పెను సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఆసియాన్

ఆసియాన్ దేశాలకు మోదీ పిలుపు  
ఆసియాన్- ఇండియా సదస్సునుద్దేశించి ప్రసంగం
 
 కౌలాలంపూర్: అంతర్జాతీయంగా పెను సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఆసియాన్ దేశాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దక్షిణ చైనా సముద్ర జలాలకు సంబంధించిన యాజమాన్య వివాదాలను శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. భారత్, ఆసియాన్‌ల మధ్య భౌగోళిక, డిజిటల్ అనుసంధానత కోసం 100 కోట్ల డాలర్ల(రూ. 6.61 వేల కోట్లు) రుణాన్ని ప్రకటించారు.  సముద్ర జలాల్లో రక్షణ, సముద్ర దోపిడీదారులకు వ్యతిరేకంగా జరిపే పోరు, విపత్తు సహాయ చర్యలు.. తదితరాల్లో ఆసియాన్ దేశాలతో సహకారానికి సంబంధించి మోదీ పలు నిర్దిష్ట ప్రణాళికలను వివరించారు.

మలేసియాలో 13వ ‘ఆసియాన్- ఇండియా’ సదస్సు ప్రారంభోత్సవంలో శనివారం మోదీ ప్రసంగించారు. ‘ఉగ్రవాదం అంతర్జాతీయ సవాలుగా మారింది. దాని ప్రతికూల ప్రభావం మనందరిపై పడుతోంది. ఆసియాన్ సభ్య దేశాలతో మాకు అద్భుతమైన ద్వైపాక్షిక సంబంధాలున్నాయి. వాటిని ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా మరింతగా పెంపొందించుకునే విషయంపై దృష్టి పెట్టాల్సి ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర తీర్మానం విషయంలో సహకారాన్ని విస్తృతం చేసుకోవాల్సి ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్ర జలాల యాజమాన్య హక్కులపై నెలకొన్న వివాదాన్ని ప్రస్తావిస్తూ.. ‘రవాణా, వాణిజ్యపరమైన నౌకాయాన స్వాతంత్య్రానికి ఆసియాన్ దేశాలతో పాటు భారత్ కూడా కట్టుబడి ఉంది.

సముద్ర జలాలపై హక్కులకు సంబంధించిన 1982 నాటి ఐక్యరాజ్య సమితి తీర్మానం సహా అన్ని అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా అన్ని దేశాలు నడుచుకోవాల్సి ఉంది. సముద్ర జలాలపై యాజమాన్య హక్కులకు సంబంధించిన వివాదాలను శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. దక్షిణ చైనా సముద్ర జలాలకు సంబంధించిన వివాదంపై కుదిరిన నిబంధనావళిని సంబంధిత దేశాలన్నీ అంగీకరించాలి’ అని భారత్ వైఖరిని స్పష్టం చేశారు. భారత్, మయన్మార్, థాయిలాండ్ దేశాల మధ్య హైవే ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయని, 2018 నాటికి ఆ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నారు.

అనుసంధానత ద్వారానే అభివృద్ధిని పంచుకోవడం సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. ఆసియాన్‌లో బ్రూనై, కాంబోడియా, ఇండోనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాంలు సభ్య దేశాలు. భారత్, ఆసియాన్ దేశాల మధ్య వాణిజ్యం 2014-15లో 76.52 బిలియన్ డాలరు ్ల(రూ. 5.02 లక్షల కోట్లు)గా ఉంది. మూడు రోజుల ఈ పర్యటనలో భాగంగా మోదీ ఈస్ట్ ఆసియా సదస్సులోనూ పాల్గొంటారు. 
 
 మోదీ ప్రసంగంలోని  ముఖ్యాంశాలు..
అన్ని ఆసియాన్ దేశాలకు ఈ వీసా సౌకర్యం.
భారత్‌లోకి వచ్చే, భారత్ నుంచి వెళ్లే పెట్టుబడుల్లో అతిపెద్ద భాగస్వామి ఆసియానే. రానున్న రోజుల్లో ఇండియా, ఆసియాన్‌ల మధ్య పెట్టుబడులు, వాణిజ్య భాగస్వామ్యం ఇంకా పెరుగుతుందని విశ్వసిస్తున్నా.
ఆసియాన్ - ఇండియా శాస్త్ర సాంకేతికత అభివృద్ధి నిధిని ప్రస్తుతమున్న 10 లక్షల డాలర్ల(రూ. 6.61 కోట్లు) నుంచి 50 లక్షల డాలర్లకు (రూ. 33.05 కోట్లు) పెంచాలని నిర్ణయించాం.
ఆర్థిక పరమైన ప్రస్తుత క్లిష్ట సమయంలో భారత్, ఆసియాన్‌లు రెండు వెలుగురేఖలు. అంతరిక్ష రంగంలో ఆసియాన్-భారత్ సహకారానికి సంబంధించిన ప్రాజెక్టు వియత్నాంలో ఏర్పడబోతోంది. ఆసియాన్ దేశాలకు గగన్(జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నేవిగేషన్) సేవలను  అందిస్తాం.
సముద్ర వాణిజ్యానికి సంబంధించిన నీలి ఆర్థికరంగ(బ్లూ ఎకానమీ) అభివృద్ధిలో సహకారం అవసరం. ఆహార భద్రతకు, భవిష్యత్ ఆర్థిక వృద్ధికి అది అత్యవసరం. తీర ప్రాంతాలున్న పలు దేశాలతో భారత్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. 
వాతావరణ మార్పు ప్రపంచం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య. 2022 నాటికి అదనంగా 175 గిగావాట్ల స్వచ్ఛ విద్యుదుత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాం. 
సౌర శక్తి అత్యధికంగా లభించే 122 దేశాలతో సౌర శక్తి దేశాల కూటమిని నేను, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ నవంబర్ 30న పారిస్‌లో ప్రారంభించబోతున్నాం.
షిల్లాంగ్‌లోని యూనివర్సిటీలో ఆసియాన్ స్టడీస్ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement