
భారత జవాన్‌ను విడుదల చేసిన పాక్!
నిన్నటిదాకా భారత్‌తో కయ్యానికి కాలుదువ్విన పాకిస్థాన్ నేడు అనూహ్యంగా స్నేహ హస్తం చాచింది. భారత జవాన్‌ను విడుదల చేసింది.
న్యూఢిల్లీ: నిన్నటిదాకా భారత్‌తో కయ్యానికి కాలుదువ్విన పాకిస్థాన్ నేడు అనూహ్యంగా స్నేహ హస్తం చాచింది. భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన రోజే (సెప్టెంబర్ 29నే) పొరపాటున సరిహద్దు దాటి పాక్‌లోకి ప్రవేశించిన జవాన్ చందు బాబుల్ చౌహాన్‌ను శుక్రవారం విడుదల చేసింది. వాఘా సరిహద్దు వద్ద పాక్ సైనికాధికారులు జవాన్ చందును భారత అధికారులకు అప్పగించింది.
22 ఏళ్ల చందు చౌహాన్.. రాష్ట్రీయ రైఫిల్ బలగానికి చెందిన సైనికుడు. పొరపాటున సరిహద్దుదాటిన అతణ్ని పాక్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా చౌహాన్ పాక్‌లోనే బందీగా ఉన్నాడు. అతణ్ని విడిపించేందుకు కేంద్ర హోం, విదేశాంగ మంత్రిత్వ శాఖలు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి.
భారత ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని, మానవీయదృష్టితో జవాన్ విడుదలకు అంగీకరించామని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ చోటుచేసుకున్న తర్వాతి రోజే భారత జవాన్ పాక్ చేతికి చిక్కడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే చందూ చౌహాన్ సర్జికల్ దాడుల్లో పాల్గొన్న జవాను కాదని, పొరపాటున సరిహద్దు దాటాడని భారత సైన్యం ప్రకటించింది. చందూ విడుదలపై మహారాష్ట్రలోని అతని కుటుంబం చెప్పలేనంత సంతోషం వ్యక్తంచేసింది.