నోట్ల కోసం ఎంతలా నిరసన వ్యక్తం చేసినా..

నోట్ల కోసం ఎంతలా నిరసన వ్యక్తం చేసినా..

రద్దుచేసిన పెద్దనోట్లను మార్చుకునే విషయంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంకు రోజుకో కొత్త నిబంధన తీసుకొస్తుండడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో విధించిన గడవు డిసెంబర్‌ 30వ తేదీన ముగిసిన విషయం తెల్సిందే. ఈలోగా మార్చుకోని వారు సరైన కారణాలను వివిరిస్తూ అఫిడవిట్‌ సమర్పిస్తే ఆర్బీఐ బ్రాంచ్‌ల వద్ద రద్దయిన నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ముందుగా ప్రకటించింది. ఆ తర్వాత మాట మార్చింది. రద్దయిన పెద్ద నోట్లను మార్చుకునే అవకాశం కేవలం ప్రవాస భారతీయులకు మాత్రమేనని ఆర్బీఐ ఆనక ప్రకటించింది. మళ్లీ దాన్ని కూడా సవరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన గడువుకాలంలో భారత్‌లో లేని ఎన్‌ఆర్‌ఐలకు మాత్రమే నోట్లను మార్చుకునేందుకు అనుమతిస్తామని ప్రకటించింది. ఆ తర్వాత బ్యాంక్‌ ఖాతాలున్న ఎన్‌ఐఆర్‌లకు మాత్రమే ఈ అవకాశం ఇస్తామని, వారు కూడా ఒరిజనల్‌ పాస్‌పోర్టులను పట్టుకొని రావాలంటూ ఆర్బీఐ తాజాగా నోటుసును జారీ చేసింది. రోజుకో రూలు పెడుతుంటే ఏమీ తెలియని అమాయక ప్రజలు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. 

 

కేవలం ఐదు వేల రూపాయల పాత నోట్లను మార్చుకునేందుకు ఢిల్లీలోని ఆర్బీఐ కార్యాలయం చుట్టూ మూడు రోజులుగా తిరుగుతున్న ఓ మహిళ అసహనాన్ని తట్టుకోలేక నగ్నంగా తయారై నిరసన వ్యక్తం చేసింది. అయినా ఆమెను కనికరించలేదు. ముంబైలోని ఆర్బీఐ కార్యాలయం ముందు రద్దయిన నోట్లను మార్చుకోలేక ప్రజలు ముఖ్యంగా, వృద్ధులు పడిగాపులు పడుతున్నారు. ప్రజలు లోనికి రాకుండా గేట్లు మూసేసిన బ్యాంక్‌ అధికారులు కేవలం బ్యాంక్‌ ఖాతాలున్న ఎన్‌ఆర్‌ఐలను మాత్రమే అనుమతిస్తున్నారు. సరైన కారణాలు వివరిస్తే ప్రజలందరికి నోట్లు మార్చుకునేందుకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం ముందుగా చెప్పిన మాటలే తమకు తెలుసునని, ఆ తర్వాత నిబంధనలను మార్చిన విషయం తెలియదని ప్రజలు వాపోతున్నారు. భక్తితో ఆవులకు ప్రజలు సమర్పించిన సొమ్మును మార్చుకునేందుకు వచ్చిన వాటి సంరక్షకులు, భర్తలకు తెలియకుండా చీరల మడతల్లో దాచుకున్న సొమ్మును మార్చుకునేందుకు వచ్చిన భార్యలు బాధితుల్లో ఎక్కువగా ఉన్నారు. 

 

1. గోమాతకొచ్చిన నిధులు: ‘గాయ్‌ కా డబ్బా’లో ప్రజలు సమర్పించిన సొమ్ములో 2,500 రూపాయల పాత నోట్లను మార్చుకునేందుకు పొవాయ్‌ నుంచి ఓ వ్యక్తి వచ్చారు. 2. మతిమరుపు బామ్మ: తాను దాచుకున్న పింఛను సొమ్ము ఐదు వేల రూపాయలను మార్చుకునేందుకు వాపి నుంచి 78 ఏళ్ల బామ్మ వచ్చారు. తనకు మతిపరుపు ఎక్కువని, ఎప్పుడో చీర మడతల్లో డబ్బు పెట్టి మరచిపోయానని, బట్టలు సర్దుతుంటే ఇటీవలే డబ్బు దొరికిందని, ముంబైలో ఉంటున్న తన కూతురికి ఈ విషయం తెలిపి మార్చుకునేందుకు ఆమెను తీసుకుని వచ్చానని చెప్పారు.3. భార్య పరుపుకిందున్న సొమ్ము: అనారోగ్యంతో మంచం పట్టిన తన భార్య పరుపు కింద 5,500 రూపాయలు బయటపడ్డాయని, వాటిని మార్చుకునేందుకు వచ్చానని కుర్లా నుంచి వచ్చిన ఓ సీనియర్‌ సిటిజన్‌ వాపోయారు. 4. తాగుబోతు భర్తకు తెలియకుండా దాచిన సొమ్ము: అత్తకు వచ్చే పింఛను నుంచి తాగుబోతు భర్తకు తెలియకుండా దాచిన ఏడువేల రూపాయలను మార్చుకునేందుకు వితయ అనే ఇల్లాలు థానే నుంచి వచ్చారు. 5. బ్యూటీషియన్‌  దాచుకున్న సొమ్ము: చీర మడతల్లో దాచుకున్న 20 వేల రూపాయల సొమ్మును మార్చుకునేందుకు బాంద్రా నుంచి ఓ బ్యూటీషియన్‌ వచ్చారు. ఈ నోట్లను మార్చుకునేందుకు తాను గతంలో బ్యాంకుల వద్దకు వెళ్లానని, ఎప్పుడూ జనంతో రద్దీ ఎక్కువగా ఉండడంతో మార్చుకోలేదని, ఆర్బీఐలో మార్చుకునేందుకు ఎలాగూ అవకాశం ఉందన్న కారణంతో ఇన్ని రోజులు ఊరుకున్నానని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

 

ఇలాంటి వారెవరూ కూడా నల్లడబ్బును మార్చుకునేందుకో వారి తరఫున మార్చేందుకో రాలేదు. వారు చెబుతున్న విషయాల్లో నిజాయితీ కనిపిస్తోంది. ఇలాంటి వారికి అన్యాయం జరగకుండా అధికారులు నిబంధనలను సడలించాల్సి ఉంటుంది.  
Back to Top