అమెరికాలోనూ కుక్క మాంసం నిషేధం! | Not just China, it’s legal to sell dog and cat meat in most American states | Sakshi
Sakshi News home page

అమెరికాలోనూ కుక్క మాంసం నిషేధం!

Mar 30 2017 4:18 PM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికాలోనూ కుక్క మాంసం నిషేధం! - Sakshi

అమెరికాలోనూ కుక్క మాంసం నిషేధం!

మానవులకు అత్యంత విశ్వాసంగా బతికే కుక్క పిల్లలను ఇంత దారుణంగా హత్య చేస్తారా?

న్యూయార్క్‌: చైనాలోని యూలిన్‌ నగరంలో 2013లో జరిగిన కుక్క మాంసం పండుగకు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించడంతో యావత్‌ ప్రపంచం నాడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మానవులకు అత్యంత విశ్వాసంగా బతికే కుక్క పిల్లలను ఇంత దారుణంగా హత్య చేస్తారా? కుక్క మాంసాన్ని కాల్చుకొని రాక్షసంగా ఎలా తింటారంటూ ముక్కున వేలేసుకున్న యూరోపియన్లు ఉన్నారు. ఆసియా దేశాల్లో కొనసాగుతున్న ఈ క్రూర సంస్కృతికి తిలోదకాలివ్వాలంటూ ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులు ఆందోళన కూడా చేశారు.

అయినప్పటికీ ఇప్పటికీ చైనా, దక్షిణ కొరియా దేశాల్లో కుక్క మాంసం ఫెస్టివల్‌ యథాతథంగా కొనసాగుతూనే ఉంది. అయితే ఫెస్టివల్‌ సందర్భంగా ఆ మాంసం భక్షకులు తమకు ఇష్టమైన కుక్కలను ఎంపిక చేసుకునేందుకు వీలుగా ప్రదర్శనలు జరపరాదంటూ ఆంక్షలు మాత్రం విధించారు. ప్రపంచంలో చైనా, దక్షిణ కొరియాతోపాటు థాయ్‌లాండ్, తైవాన్, ఫిలిప్పీన్స్‌ దేశాల్లో కుక్కలు, పిల్లులను ఎక్కువగా తింటారు. జంతు ప్రేమికుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, తైవాన్‌ దేశాల్లో ఇటీవలనే కుక్క, పిల్లి మాంసం అమ్మకాలను నిషేధించారు. చైనాలో కుక్క మాంసం ఫెస్టివల్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన అమెరికాలో ఆరు రాష్ట్రాల్లో మినహా మిగతా 44 రాష్ట్రాల్లో కుక్క మాంసం విక్రయం పట్ల ఎలాంటి నిషేధం లేదు.


వర్జీనియా, కాలిఫోర్నియా, హవాయి, న్యూయార్క్, జార్జియా, మిచిగాన్‌ రాష్ట్రాల్లో కుక్క మాంసాన్ని నిషేధిస్తూ చట్టాలున్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి చట్టాలు లేనందున కుక్క మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఈ మాంసం పట్ల స్థానికుల్లో చాలా మందికి వ్యతిరేకత ఉండడం వల్ల మరీ అంత బహిరంగంగా కుక్క మాంసాన్ని విక్రయించరు. చైనా, ఫిలీప్పీన్స్, థాయ్‌లాండ్‌ దేశస్థులు నివసించే ప్రాంతాల్లోనే కుక్క మాంసాన్ని బహిరంగంగా విక్రయిస్తున్నారు. కుక్క బరువును బట్టి 25 డాలర్ల నుంచి 75 డాలర్ల వరకు విక్రయిస్తున్నారు.

అమెరికాలోని మిగతా 44 రాష్ట్రాల్లో కూడా కుక్క, పిల్లి మాంసాన్ని నిషేధించాలనే ప్రతిపాదనలు ఇప్పుడు ముందుకు వచ్చాయి. ఫ్లోరిడాకు చెందిన డెమోక్రట్‌ సభ్యుడు అల్సీ ఎల్‌ హాస్టింగ్స్, అదే ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్‌ సభ్యుడు వెర్న్‌ బుచానన్, మిచిగాన్‌కు చెందిన రిపబ్లికన్‌ సభ్యుడు డేవ్‌ ట్రాట్, పెన్సిల్వేనియాకు చెందిన బ్రెందెన్‌ బోయెల్‌లు ‘హెచ్‌ఆర్‌ 1406, కుక్క, పిల్లి మాంసం నిషేధ చట్టాన్ని’ మార్చి 7న అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉన్నందున త్వరలోనే చట్టం వస్తుందని జంతు ప్రేమికులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement