
‘దండకారణ్య ప్రజారాజ్యం’ కావాలి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్పొరేట్ల అనుకూల మేక్ ఇన్ ఇండియాకు ప్రత్యామ్నాయంగా దండకారణ్య పాలన లాంటి ప్రజారాజ్య నిర్మాణం అవసరమని విరసం నేత వరవరరావు పేర్కొన్నారు.
విరసం 45వ ఆవిర్భావ సభలో వరవరరావు
మేక్ ఇన్ ఇండియాకు ప్రత్యామ్నాయం అదే
ప్రపంచీకరణలో భాగంగానే తెలంగాణ, ఏపీలో విధానాల అమలు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్పొరేట్ల అనుకూల మేక్ ఇన్ ఇండియాకు ప్రత్యామ్నాయంగా దండకారణ్య పాలన లాంటి ప్రజారాజ్య నిర్మాణం అవసరమని విరసం నేత వరవరరావు పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విరసం 45వ ఆవిర్భావ సభ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకే మోదీ మేక్ ఇన్ ఇండియా, సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ, ఏపీ సీఎం చంద్రబాబు నవ్యాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో హరితహారం అమలు జరుగుతోందన్నారు. కేసీఆర్ దోపిడీ భూ సంసర్కరణలు, పారిశ్రామిక విధానాలను అమలు చేస్తుంటే ఏపీ రాజధానికి భూసేకరణ పేరుతో చంద్రబాబు విధ్వంసక అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని వరవరరావు ఆరోపించారు. దేశమంతా వ్యతిరేకించిన భూసేకరణ ఆర్డినెన్స్‌ను చంద్రబాబు, కేసీఆర్ అమల్లోకి తెచ్చారని దుయ్యబట్టారు.
కేసీఆర్ స్వచ్ఛ హైదరాబాద్‌ను చెత్త హైదరాబాద్‌గా మార్చారని ధ్వజమెత్తారు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో భాగంగానే రెండు రాష్ట్రాల్లో విధానాలు అమలవుతున్నాయన్నారు. ముస్లిం యువకులను, ఎర్రచందనం కూలీలను, విప్లవకారులను కాల్చి చంపడంలో రెండు విధానాలు ఒక్కటేనన్నారు. ఉద్యమ స్ఫూర్తితో 16 రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ రాజ్య స్థాపన నిర్మాణం సాగుతుంటే దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు గ్రీన్ హంట్ పేరుతో ప్రజలపై యుద్ధం ప్రకటిస్తున్నాయన్నారు. దీనిపై పోరాడేందుకు గ్రామస్థాయి నుంచి గెరిల్లా జోన్‌వరకు ప్రజా ఉద్యమాలు నిర్మించాలన్నారు.
పథకాల అమలుతో అభివృద్ధి అసాధ్యం:
ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ద్వారా అభివృద్ధి సాధ్యం కాదని విరసం నేత పాణి అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా-కాషాయీకరణ-జనతన సర్కార్ ప్రత్యామ్నాయం’ అంశంపై ఆయన మాట్లాడుతూ దండకారణ్యంలో ప్రతి కుటుంబానికి ఇల్లు, భూమి, నిర ంతర విప్లవ భూసంస్కరణలు అమలు జరుగుతుంటే ఇక్కడ మాత్రం ప్రజల నుంచి భూములను లాక్కొని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. తెలంగాణ పునర్మిర్మాణం బూర్జువ మాట అని, తెలంగాణను తిరిగి గెరిల్లా జోన్‌గా మార్చాలన్నారు. భూసేకరణ ఆర్డినెన్స్ అంశంపై న్యాయవాది రవికుమార్ మాట్లాడుతూ భూములు సాగు చేసే వారికే భూహక్కులు ఉండేలా ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సి ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పాలకుల ఎజెండా-ప్రజల ఎజెండా అంశాలపై కాశీం, వరలక్ష్మీ తదితరులు ప్రసంగించారు. విరసం ప్రతినిధులు రివేరా, రాంకీలు అధ్యక్షత వహించిన ఈ సభలో పలు పుస్తకాలను ఆవిష్కరించారు.
నాటి పరిస్థితులే నేడూ ...
విరసం ఆవిర్భావం నాడున్న పరిస్థితులే నేటికీ కొనసాగుతున్నాయని వరవరరావు అన్నారు. ఆనాడు విశాఖ విద్యార్థులు రచయితలారా మీరు ఎటువైపు అని ప్రశ్నించినట్లుగానే పాలక వర్గం సృష్టించే భ్రమలలో కొట్టుకుపోతున్న నేటి రచయితలనూ ఈ తరం అదే విధంగా ప్రశ్నిస్తుందన్నారు. కవులు, రచయితలు, కళాకారులు ఈ పరిస్థితులను సాహిత్యంలో ఆవిష్కరించాలన్నారు.