యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆహార భద్రత పథకం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయనుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ హెచ్చరించింది.
ఆహార భద్రతతో ఆర్థిక వ్యవస్థకు చిల్లు!
Aug 30 2013 2:04 AM | Updated on Sep 1 2017 10:14 PM
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆహార భద్రత పథకం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయనుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ హెచ్చరించింది. తాజాగా ఆహార భద్రత బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. కాగా, ఈ పథకం భారత్ సార్వభౌమ(సావరీన్) క్రెడిట్ రేటింగ్‌కు ముప్పుగా పరిణమించనుందని కూడా మూడీస్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ ఖజానాకు భారీ చిల్లుతోపాటు స్థూల ఆర్థిక పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది.
ఈ పథకం వల్ల ఆహార సబ్సిడీల భారం స్థూలదేశీయోత్పత్తి(జీడీపీ)లో 1.2 శాతానికి ఎగబాకనున్నట్లు(ప్రస్తుతం 0.8%) లెక్కగట్టింది. భారత్‌కు మూడీస్ ప్రస్తుతం ‘బీఏఏ3(స్థిర అవుట్‌లుక్)’ రేటింగ్ కొనసాగిస్తోంది. ఆహార భద్రత చట్టం అమలుకు ప్రభుత్వం రూ.1.3 లక్షల కోట్లను వెచ్చించాల్సి వస్తుందని అంచనా. ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) కూడా దూసుకెళ్లే ప్రమాదం ఉందని మూడీస్ అభిప్రాయపడింది. ద్రవ్యలోటును కట్టడి చేయడంలో విఫలమైతే రేటింగ్ కోత ఖాయమంటూ మరో రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ హెచ్చరించడం విదితమే.
Advertisement
Advertisement