’కబాలి’ అభిమానులారా.. మీకో విజ్ఞప్తి! | Milkmen want Rajinikanth fans to ditch milk bath tradition | Sakshi
Sakshi News home page

’కబాలి’ అభిమానులారా.. మీకో విజ్ఞప్తి!

Jul 18 2016 3:06 PM | Updated on Sep 4 2017 5:16 AM

’కబాలి’ అభిమానులారా.. మీకో విజ్ఞప్తి!

’కబాలి’ అభిమానులారా.. మీకో విజ్ఞప్తి!

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ’కబాలి’ సినిమా ఈ శుక్రవారం విడుదల కావడం పక్కా కావడంతో అప్పుడే ’కబాలి’ పండుగ మొదలైంది.

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ’కబాలి’ సినిమా ఈ శుక్రవారం విడుదల కావడం పక్కా కావడంతో అప్పుడే ’కబాలి’  పండుగ మొదలైంది. సూపర్ స్టార్ రజనీకాంగ్ సినిమా ఎప్పుడు విడుదలైనా.. నిలువెత్తు ఆయన కటౌట్‌లు పాలాభిషేకంతో తళతళలాడాల్సిందే. ఇది ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. 1992లో వచ్చిన ’అన్నామలై’ (తెలుగులో వెంకటేశ్ ’కొండపల్లిరాజా’) సినిమాలో రజనీకాంత్ పాలవాడిగా కనిపించాడు. అప్పటినుంచి అభిమానులు ’తలైవా’ కటౌట్ ను తళతళలాడించేందుకు వేలాది లీటర్ల పాలతో అభిషేకాలు చేస్తున్నారు.

ఇప్పుడు టన్నులకొద్దీ అంచనాలతో ’కబాలి’ సినిమా విడుదలవుతుండటంతో వేలలీటర్ల పాలు ’తలైవా’  అభిషేకానికి వృథా కావడం ఖాయంగా కనిపిస్తుండటంతో తమిళనాడు పాలవ్యాపారుల సంఘం ప్రతినిధులు ’కబాలి’  అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. రజనీ కటౌట్‌లకు పాలతో అభిషేకాలు చేసే సంప్రదాయాన్ని విడనాడాలని కోరారు. ఇలా వేలాది లీటర్లు వృథా చేసేముందు నిరుపేదలు, ఆకలితో అలమటించేవారికోసం కూడా ఆలోచించాలని సూచించారు.


జూలై 22న కబాలి విడుదల రోజు రూ. 20 లక్షలు విలువచేసే 50వేల లీటర్ల పాలు కటౌట్ల అభిషేకాని కోసం వృథా అయ్యే అవకాశముందని పాల వ్యాపారుల సంఘం తెలిపింది. తమిళనాడులో 15శాతం మంది ప్రజలకు ప్రతిరోజూ పాలుకొనేందుకు డబ్బుల్లేవు. ఇలాంటి దుర్భర పరిస్థితుల నడుమ ఇలా వృథా చేయడం సబబా అని మిల్క్ డీలర్స్, ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పొన్నుస్వామి పేర్కొన్నారు. రజనీ మార్గంలో ఎన్నో సేవా కార్యాక్రమాలు చేసే అభిమానులు.. పాలాభిషేకాల విషయంలోనూ రజనీ సూచనలు పాటించి.. ఈ దురాచారాన్ని మానుకోవాలని ఆయన సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement