'కథ అడ్డం తిరుగుతోంది' | Sakshi
Sakshi News home page

'కథ అడ్డం తిరుగుతోంది'

Published Tue, Sep 1 2015 10:47 AM

'కథ అడ్డం తిరుగుతోంది' - Sakshi

ముంబయి: పటేళ్లకు ఓబీసీల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఓ పక్క గుజరాత్లో తీవ్ర ఆందోళన జరుగుతుండగా ఆ ఆందోళనకు వ్యతిరేకంగా ఓ తాజా ఉద్యమం మహారాష్ట్రలో మొదలవుతుంది. పటేళ్లు ఇప్పటికే ఉన్నత వర్గానికి చెందినవారని వారికి ఎట్టి పరిస్థితిలో ఓబీసీల్లో చోటు ఇవ్వొద్దని మహారాష్ట్రకు చెందిన ఓబీసీ ఆర్గనైజేషన్ ముందుకు వెళుతోంది. పటేళ్లతోపాటు మరాఠా కమ్యునిటీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వడానికి వీళ్లేదని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే ఈ సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్ శ్రవణ్ డియోర్.. బీజేపీ ఎంపీ డాక్టర్ సుభాష్ భామ్రి కలిసి దీనిపై వినతిపత్రం సమర్పించారు.

తప్పకుండా పార్లమెంటులో ఓబీసీ రిజర్వేషన్ల అంశం లేవనెత్తాలని ఆ వినతిపత్రంలో డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని మరాఠా కమ్యునిటీ, ఉత్తరప్రదేశ్, హర్యానాలోని జాట్లు, గుజరాత్లోని పటేళ్లు తమను ఓబీసీల్లో చేర్చాలని గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా, గుజరాత్లో ఈ ఉద్యమం హార్ధిక్ పటేల్ అనే యువకుడి నేతృత్వంలో ఉధృతంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపట్ల మహారాష్ట్ర ఓబీసీ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో మండల్ కమిషన్ కూడా పైన పేర్కొన్న వర్గాలు ఇప్పటికే ఉన్నత వర్గంగా ఉన్నాయని, అధికారం విషయంలోనూ, ఆర్థిక పరమైన అంశాల విషయంలోనూ ఉన్నత స్థాయిలో ఉన్నందున వారిని ఓబీసీల్లో చేర్చవద్దని చెప్పిందని గుర్తుచేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement