బోనస్ బిల్లుకు లోక్‌సభ ఓకే

బోనస్ బిల్లుకు లోక్‌సభ ఓకే


న్యూఢిల్లీ: ఇరవై మంది అంతకంటే ఎక్కువ సంఖ్యలో కార్మికులు ఉన్న కర్మాగారాల్లో బోనస్ లెక్కింపు పరిమితిని రెట్టింపు చేస్తూ ‘బోనస్ చెల్లింపు (సవరణ) బిల్లు 2015’కు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. బోనస్ లెక్కింపు పరిమితి ప్రస్తుతమున్న నెలకు రూ. 3,500 నుంచి 7,000 రూపాయలకు పెరగనుంది. అదే సమయంలో బోనస్ చెల్లింపుకు అర్హత పరిమితిని.. ప్రస్తుతమున్న రూ. 10,000 నెల వేతనం నుంచి రూ. 21,000 వేతనానికి పెంచటంపై పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ బిల్లు అమలులోకి వస్తే.. 2014 ఏప్రిల్ నుంచి వర్తిస్తుంది.



ఈ బిల్లుపై చర్చకు కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సమాధానమిస్తూ.. కార్మిక ప్రయోజనాల రక్షణకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని పేర్కొన్నారు. ఈ బిల్లు వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 6,203 కోట్లు అదనపు భారం పడుతుందని చెప్పారు. జాతీయ కనీస వేతనాన్ని తప్పనిసరి చేస్తూ త్వరలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ‘రెండో జాతీయ కార్మిక కమిషన్ సిఫారసులను అనుసరిస్తూ.. 44 కేంద్ర కార్మిక చట్టాలను - పారిశ్రామిక వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్, కార్మికుల భద్రత, రక్షణ పరిస్థితుల కోడ్ అనే 4 కోడ్‌ల రూపంలోకి మారుస్తాం’ అని వివరించారు.



బిల్లుపై చర్చలో టీఆర్‌ఎస్ ఎంపీ కె.విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. బోనస్ చెల్లింపుకు అర్హత వేతనాన్ని నెలకు రూ. 10 వేల నుంచి రూ. 21 వేలకు పెంచటం లోపభూయిష్టమన్నారు. కర్మాగారాల్లో కాంట్రాక్టు కార్మికులతో ఎక్కువ చేయించుకుంటూ తక్కువ వేతనం ఇస్తున్నారన్నారు.  శంకర్‌ప్రసాద్‌దత్తా(సీపీఎం) ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు.



టీడీపీ ఎంపీ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దేశంలో కార్మిక చట్టాలు చాలా బలహీనంగా ఉన్నాయంటూ.. కార్మికులకు భద్రత, రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. గత సెప్టెంబర్ 2వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు ఒక రోజు సమ్మె చేసినపుడు కేంద్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈ బోనస్ బిల్లును తీసుకువచ్చారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top