పెద్దల సభలో గట్టెక్కేనా? | Kiran Kumar Reddy dares Centre to table Telangana Bill in Parliament in same form | Sakshi
Sakshi News home page

పెద్దల సభలో గట్టెక్కేనా?

Feb 11 2014 2:27 AM | Updated on Aug 18 2018 4:13 PM

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ఏ క్షణంలోనైనా రాజ్యసభకు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో.. పెద్దల సభలో ఆ బిల్లు గట్టెక్కుతుందా? లేదా?

 గందరగోళంలో తెలంగాణ బిల్లును ఎలా తీసుకొస్తారు?
బీజేపీ మద్దతిస్తుందా, లేదా?  పార్టీలో మారిన స్వరాలతో ఉత్కంఠ
ఇరు ప్రాంతాల్లోనూ తమకు ఇబ్బంది రాకూడదన్నది ‘కమలం’ ఆలోచన
బిల్లుకు మద్దతివ్వకుండా, అడ్డు చెప్పకుండా తప్పించుకునేలా వ్యూహం
బిల్లుపై ఓటింగ్ జరపాలని కోరకపోవచ్చు
బీజేపీని ఒప్పించేలా కేంద్రం వ్యూహం!
మూజువాణి ఓటుతోనే బిల్లుకు ఆమోదం?
ఓటింగ్ తప్పని పరిస్థితుల్లో బీజేపీ వాకౌట్!

 
 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ఏ క్షణంలోనైనా రాజ్యసభకు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో.. పెద్దల సభలో ఆ బిల్లు గట్టెక్కుతుందా? లేదా? అన్నది అంతటా ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ ఏర్పాటుకు మద్దతిస్తామని మొదటి నుంచీ చెప్తూ వచ్చిన పలు పార్టీలు ఇప్పుడు స్వరం మార్చటమే ఇందుకు కారణం. ఆయా పార్టీలు గతంలో తీసుకున్న నిర్ణయం మేరకైతే రాజ్యసభలో వాటి బలాబలాల ఆధారంగా బిల్లు రాజ్యసభ ఆమోదం పొందటం సులువే. కానీ అధికార కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం చివరి దాకా నాన్చి.. చివరి దశలో తెలంగాణపై నిర్ణయానికి రావటం.. పైగా ఆ బిల్లును తిరస్కరిస్తూ రాష్ట్ర శాసనసభలో తిర్మానం చేయటం వంటి కారణాలతో పలు జాతీయ పార్టీలు ఈ విషయంలో తమ గత వైఖరికి కాస్త విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిల్లుకు అవి మద్దతిస్తాయా, వ్యతిరేకిస్తాయా అన్న సంశయం అందరినీ తొలుస్తోంది. అదీగాక ప్రస్తుత సమావేశాల్లో పార్లమెంటు ఉభయసభల్లోనూ వరుసగా నాలుగు రోజుల నుంచీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఇంత గందరగోళం మధ్య ప్రభుత్వం తెలంగాణ బిల్లును ఎలా ప్రవేశపెడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
 
 బీజేపీని ఒప్పించేదెలా...: తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ మద్దతు పలుకుతోంది. కానీ విభజన వల్ల కాంగ్రెస్‌కే లబ్ధి కలుగుతుందని, తమకు ఒరిగేదేమీ లేదని, అలాంటప్పుడు మద్దతెలా ఇస్తామని పార్టీలోని ‘ప్రధాన’మైన వ్యక్తికి అనుకూలమైన ఒక వర్గం వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీలో ప్రస్తుతం తెలంగాణ, సీమాంధ్ర నేతల నుంచి పరస్పర వ్యతిరేక ప్రకటనలు వెలువడుతున్నాయి. అయితే ఆర్‌ఎస్‌ఎస్ ప్రోద్బలంతో పాత వైఖరికే బీజేపీ కట్టుబడుతుందంటున్నారు. వచ్చే ఎన్నికల అనంతరం తెలంగాణలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం వస్తుందని, 2019 నాటికి అక్కడ అధికారమూ దక్కవచ్చని పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. ఏదేమైనా అటు సీమాంధ్రను ఆకట్టుకుంటూనే, ఇటు తెలంగాణకు అడ్డుపడని వైఖరి ప్రదర్శించాలనే నిర్ణయానికి వచ్చింది. కాబట్టి తమకు ఇబ్బంది కలగకుండా బిల్లును కాంగ్రెస్ ఆమోదింపజేసుకునే వైఖరిని ప్రదర్శించాలని బీజపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిల్లుపై బీజేపీ ఓటింగ్ కోరకపోవచ్చని సమాచారం. తప్పనిసరై ఓటింగ్ జరిగితే మాత్రం తెలంగాణకు బీజేపీ మద్దతిస్తుందని, అదే సమయంలో సీమాంధ్ర ప్రయోజనాల కోసం మరిన్ని సవరణలు ప్రతిపాదించే అవకాశం ఉందని చెప్తున్నారు. బిల్లు గట్టెక్కేందుకు బీజేపీ మద్దతే కీలకం గనుక ఆ పార్టీకి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితీ కల్పించకుండా కేంద్రం వారు ప్రతిపాదించే సవరణలను బిల్లులో చేర్చవచ్చని అంటున్నారు. బీజేపీ కూడా.. తాము గొడవ చేసినా దాని మధ్యే మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదింపజేసుకోవాల్సిందిగా కేంద్రానికి సూచించే అవకాశముంది. అధికార ప్రతిపక్షాల మధ్య సభా సమన్వయంలో భాగంగా ఇలాంటివి గతంలో అనేకం జరిగాయి.
 
 మద్దతు ప్రకటించిన పార్టీలు: కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఎన్సీపీ, జేడీ(యూ), టీడీపీ, సీపీఐ, ఆర్జేడీ
 -ఈ పార్టీల బలం: 157
 - వాస్తవ బలం: ఇందులో సీమాంధ్ర కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఎంపీలు వ్యతిరేకంగా నిలిచే అవకాశం ఉంది. అలాగే సీమాంధ్ర టీడీపీ నుంచి ఇద్దరు వ్యతిరేకించనున్నారు. అంటే ఇక మిగిలిన మొత్తం: 152
 వ్యతిరేకిస్తున్న పార్టీలు: తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, శివసేన, ఎస్‌పీ, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, ముస్లిం లీగ్
 - ఈ పార్టీల బలం: 43
 తటస్థంగా ఉన్న పార్టీలు: అన్నా డీఎంకే, శిరోమణి అకాళీదళ్, మరికొన్ని చిన్న పార్టీలు.
 
 ఇబ్బంది లేకుండా ఉండాలంటే...
 బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అధికార పార్టీ సీమాంధ్ర ఎంపీలను, టీడీపీ ఎంపీలను ముందుగా సస్పెండ్ చేసే అవకాశముంది. బిల్లుపై ఎవరైనా ఓటింగ్ కోరినా, బిల్లుకు అడ్డుపడినట్లుగా ఉండకుండా బీజేపీ వాకౌట్ చేయవచ్చనీ అంటున్నారు. కానీ వాకౌట్ చేస్తే ఇరు ప్రాంతాల వారు దాన్నెలా అర్థం చేసుకుంటారన్న మీమాంస ప్రస్తుతం ఆ పార్టీలో నెలకొంది. రాజ్యసభలో బీజేపీ కనుక బిల్లుకు వ్యతిరేకంగా ఓటే స్తే వ్యతిరేకుల బలం 43 నుంచి 90కి పెరుగుతుంది. బిల్లుకు మద్దతిచ్చే సభ్యుల సంఖ్య 152 నుంచి 104కు తగ్గుతుంది. అప్పుడు సాధారణ మెజారిటీ (117) దక్కాలంటే తటస్థులు తదితర సభ్యుల మద్దతు తప్పనిసరి.
  రాజ్యసభలో మొత్తం సభ్యులు: 245
  ప్రస్తుత ఖాళీలు: 03
  నామినేటెడ్ సభ్యులు: 09
  ఓటు అర్హత కలిగిన సభ్యులు: 233
  బిల్లు ఆమోదానికి సాధారణ మెజారిటీ: 117

Advertisement
 
Advertisement
Advertisement