చికిత్స చేయించుకోడానికి వచ్చిన ఇద్దరు మహిళలపై తాను అత్యాచారం చేయలేదంటూ ఓ భారత సంతతి వైద్యుడు ఆస్ట్రేలియా కోర్టుకు మొరపెట్టుకున్నాడు.
చికిత్స చేయించుకోడానికి వచ్చిన ఇద్దరు మహిళలపై తాను అత్యాచారం చేయలేదంటూ ఓ భారత సంతతి వైద్యుడు ఆస్ట్రేలియా కోర్టుకు మొరపెట్టుకున్నాడు. కేరళలోని కొచ్చికి చెందిన మను మైంబిల్లీ గోపాల్ ఆస్ట్రేలియాలో వైద్యుడిగా ఉన్నారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో సన్బరీ క్లినిక్కు కడుపునొప్పితో వచ్చిన ఇద్దరు మహిళలపై ఆయన అత్యాచారం చేశారని ఆరోపణలొచ్చాయి. మార్చి ఒకటో తేదీన భారత్ వెళ్లే విమానం ఎక్కేందుకు మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వేచి చూస్తుండగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 29న పోలీసులు ఆయనను ఆరోపణలపై ప్రశ్నించగా, కొచ్చి వెళ్లేందుకు రాత్రి ఒంటిగంట సమయంలో ఉన్న విమానాన్ని ఉదయం 11 గంటలకు మార్చుకున్నారని స్థానిక పత్రికలలో కథనం వచ్చింది. అరెస్టు నుంచి తప్పించుకోడానికే ఇలా చేశారని పేర్కొన్నారు.
అయితే, తాను చాలా భయపడిపోయానని, ఏం చేయాలో సరిగా ఆలోచించలేకపోయానని డాక్టర్ గోపాల్ తెలిపారు. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలన్నది మాత్రమే తన ఆలోచన అన్నారు. కేవలం తన లైంగిక వాంఛలు తీర్చుకోడానికే గోపాల్ ఆ ఇద్దరు మహిళలకు వైద్య పరీక్షలు చేయాలనుకున్నట్లు ప్రాసిక్యూటర్ లెస్లీ టేలర్ కోర్టులో వాదించాచు. డాక్టర్ గోపాల్ వృత్తిపరంగా మంచి వైద్యుడా కాదా అన్నదాని గురించి ఈ విచారణ జరగట్లేదని, కేవలం ఆ సంఘటన మీదే జరుగుతోందని టేలర్ అన్నారు. నలుగురు బిడ్డల తల్లి అయిన రెండో బాధితురాలిని పరీక్ష చేసే సమయంలో డాక్టర్ గోపాల్ చాలా అసభ్యంగా మాట్లాడారని, అది సరికాదని టేలర్ చెప్పారు.
కానీ డిఫెన్స్ లాయర్ మైఖేల్ టోవీ మాత్రం ఈ వాదనలను ఖండించారు. ఒకవేళ డాక్టర్ గోపాల్ నిజంగానే అసభ్యంగా ప్రవర్తించి ఉంటే కేవలం ఒకరిద్దరు వ్యక్తులు మాత్రమే ఎందుకు ఇబ్బంది పడతారని ఆయన అడిగారు. ఆయన సాధారణ ఒత్తిడికి సంబంధించిన కేసులను ఆస్ట్రేలియాలో చూస్తుంటారని, దీంతోపాటు క్లినిక్ బాధ్యతలు కూడా ఆయనమీదే ఉన్నాయని తెలిపారు. గోపాల్ భార్యా బిడ్డలు భారతదేశంలో ఉంటారని, ఇక్కడ ఆయన ఒంటరిగా మిగిలిపోయారని అన్నారు. ఉద్యోగం లేక, కుటుంబ లేక దారుణమైన పరిస్థితిలో ఆయన చిక్కుకున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తీసుకున్న నిర్ణయం తప్పేమీ కాదని వాదించారు. అసలు వారిద్దరిపైనా డాక్టర్ గోపాల్ అత్యాచారానికి ప్రయత్నించనే లేదని.. కచ్చితంగా చెప్పారు.