విదేశీయులకు, ఎన్‌ఆర్‌ఐలకు భారత్‌లో అద్దెగర్భం దొరకదు! | Sakshi
Sakshi News home page

విదేశీయులకు, ఎన్‌ఆర్‌ఐలకు భారత్‌లో అద్దెగర్భం దొరకదు!

Published Fri, Oct 16 2015 1:14 AM

India can not rental pregnancy

న్యూఢిల్లీ: సరోగసీ (అద్దె గర్భం) ద్వారా బిడ్డను కనేవారికి భారత్ కేంద్రస్థానంగా మారుతోందనే ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ విషయంలో కఠిన చట్టాన్ని తేవాలని నిర్ణయించింది. విదేశీయులు, ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులు... భారత్‌లో అద్దెగర్భం ద్వారా పిల్లలు కనకుండా పూర్తిగా నిషేధం విధించాలని జాతీయ మహిళాకమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ), ఆరోగ్యశాఖ ప్రతిపాదించా యి. సరోగసీకి సంబంధించిన కొత్తబిల్లుపై ఆరోగ్యశాఖ ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరింది. బిల్లుకు నవంబరు 15 నాటికల్లా తుదిరూపునివ్వనుంది.

తల్లి కావాలనుకుంటున్న మహిళ నుంచి అండాన్ని సేకరించి... భర్త లేదా సహజీవన భాగస్వామి వీర్యంతో ఫలదీకరించి...మరో మహిళ గర్భంలో ఫలదీకరించిన పిండాన్ని ప్రవేశపెడతారు. ఆమె నవమాసాలు బిడ్డను మోసి జన్మనిస్తుంది. జన్యుపరమైన తల్లికి బిడ్డకు అప్పగిస్తుంది. గర్భాన్ని మోసిన తల్లికి ప్రతిఫలం ముట్టజెపుతారు. బిడ్డలు పుట్టే అవకాశం లేనపుడు...ఇలా మరో మహిళ గర్భాశయాన్ని అద్దెకు తీసుకోవడంలో తప్పులేదు. కానీ గర్భం దాల్చే శ్రమ లేకుండా పిల్లలను కనాలనుకునేవారి సంఖ్య ఈ మధ్య బాగా పెరుగుతోంది.

భారత్‌లోని పేద మహిళలకు డబ్బు ఆశచూపి సరోగసీకి ఒప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై చట్టాన్ని తెచ్చే ఉద్దేశంతో 2010లో తొలి ముసాయిదాను రూపొందించారు. 2013లో దీనిలో మార్పులు చేశారు. ఇప్పు డు కఠినమైన నిబంధనలతో చట్టం చేయనున్నారు. ఆరోగ్యశాఖ, హోంశాఖ,  మానవహక్కుల కమిషన్, ఎన్‌సీడబ్ల్యు, మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు.

విదేశీయులు, ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులెవరూ భారత్‌లో అద్దెగర్భం ద్వారా పిల్లలను కనకుండా నిషేధం విధిం చాలనే తమ సూచనపై ఏకాభిప్రాయం కుదిరిందని ఎన్‌సీడబ్ల్యు చైర్‌పర్సన్ లలితా కుమారమంగళం వెల్లడించారు. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు గర్భాన్ని అద్దెకు ఇవ్వడానికి వీలుకల్పించాలనే తమ సిఫారసుకు ఆమోదం లభించిందన్నారు.

Advertisement
Advertisement