మేము ఏం అడగటం లేదు... మా హక్కులు మాత్రమే అడుగుతున్నాం అని రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న పటేల్ సామాజిక వర్గం నేత హర్దిక్ పటేల్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: మేము ఏం అడగటం లేదు... మా హక్కులు మాత్రమే అడుగుతున్నాం అని రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న పటేల్ సామాజిక వర్గం నేత హర్దిక్ పటేల్ స్పష్టం చేశారు. ఆదివారం న్యూఢిల్లీలో హర్దిక్ విలేకర్లతో మాట్లాడారు. అలాగే తమ ఉద్యమంలో ఏ రాజకీయ పార్టీ కూడా భాగస్వామిగా లేదని తెలిపారు. తమ రిజర్వేషన్ల పోరాటాన్ని దేశమంతా విస్తరిస్తామని ఆయన వివరించారు. రేపు మధ్యప్రదేశ్లో భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు.
పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని హర్దిక్ పటేల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రిజర్వేషన్లపై పోరాటం కోసం మద్దతు సంపాదించేందుకు గుజ్జర్లు, జాట్ నేతలతో భేటీ అయ్యేందుకు హర్దిక్ ఆదివారం న్యూఢిల్లీ వచ్చిన విషయం విదితమే. తన ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలవడం లేదని హర్దిక్ ఇప్పటికే చెప్పారు.