క్రమబద్ధీకరణ చేయొద్దు!

క్రమబద్ధీకరణ చేయొద్దు! - Sakshi


* మేం ఆదేశాలిచ్చేదాకా జీవో 146ను అమలు చేయకండి

* అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

* దరఖాస్తులను మాత్రం స్వీకరించవచ్చు

* జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరించిన తీరు సరికాదు

* శాసన ప్రక్రియ ద్వారా సవరించుకోవచ్చు

* పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు ఆదేశం

* విచారణ జనవరి 27కు వాయిదా




సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని అక్రమ నిర్మాణాలను తాము చెప్పే వరకూ క్రమబద్ధీకరించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమబద్ధీకరణ కోసం జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణ చేసిన తీరు సరికాదని, కార్యనిర్వాహక అధికారాల ద్వారా చట్ట సవరణ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కావాలంటే శాసన ప్రక్రియ ద్వారా చట్ట సవరణ చేసుకోవచ్చని సూచించింది.



అయితే క్రమబద్ధీకరణ కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు మాత్రం అనుమతించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలె, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను జనవరి 27కు వాయిదా వేసింది.

 

ఆ చట్ట సవరణ తప్పు: పిటిషనర్ న్యాయవాది

జీహెచ్‌ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు వీలుగా ప్రభుత్వం జారీ చేసిన 146, 152 జీవోలను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎ.పద్మనాభరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిని మంగళవారం హైకోర్టు విచారించింది. తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపించారు.



ఈ ఏడాది అక్టోబర్ 28కి ముందు నిర్మించిన అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ రాష్ట్రప్రభుత్వం జీవో 146 జారీ చేసిందని కోర్టుకు చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 455ఎఎకు సవరణ చేసినట్లుగా జీవోలో పేర్కొన్నారని... ఈ సవరణ ప్రకారం క్రమబద్ధీకరణ గడువును 5.12.2007 నుంచి 2015కు పొడిగించారని చెప్పారు. అయితే సెక్షన్ 101 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఏ చట్టాన్నయినా వర్తింప (అడాప్ట్) చేసుకోవచ్చని, సవరణ మాత్రం చేయడానికి వీల్లేదని కోర్టుకు నివేదించారు.

 

పిటిషనర్ వాదనల్లో వాస్తవముంది: ధర్మాసనం

పిటిషనర్ న్యాయవాది వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘మా ముందున్న ప్రాథమిక ఆధారాలను బట్టి పిటిషనర్ తరఫు న్యాయవాది చెబుతున్న దాంట్లో వాస్తవం ఉంది. సెక్షన్ 101 కేవలం ఓ చట్టాన్ని అన్వయించుకోవడానికి ఉద్దేశించిందే. దాని కింద చట్ట సవరణ చేయడానికి వీల్లేదు. చట్ట సవరణ చేసే విషయంలో మీకు (రాష్ట్ర ప్రభుత్వానికి) హక్కులపై మాకు కొంత సందేహం ఉంది..’’ అని పేర్కొంది.



అయితే ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదిస్తూ... ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 100, రాజ్యాంగంలోని  131, 372 అధికరణల ప్రకారం ఈ చట్ట సవరణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. అందులో భాగంగానే క్రమబద్ధీకరణ జీవో జారీ చేశామని కోర్టుకు విన్నవించారు. దీనిపై సంతృప్తి చెందని ధర్మాసనం... శాసనాధికారం ద్వారా చట్ట సవరణ చేసుకోవచ్చే తప్ప, ఇలా కార్యనిర్వాహక అధికారాల ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి చట్ట సవరణ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.



తాము తదుపరి ఆదేశాలిచ్చేంత వరకు జీవో 146 ప్రకారం అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి వీల్లేదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే క్రమబద్ధీకరణ నిమిత్తం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించవచ్చని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వచ్చే నెల 27కు వాయిదా వేసింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top