అలనాటి నటికి దుర్భర అవస్థ! | Geeta Kapoor abandoned by son in hospital | Sakshi
Sakshi News home page

అలనాటి నటికి దుర్భర అవస్థ!

May 29 2017 1:17 PM | Updated on Sep 5 2017 12:17 PM

అలనాటి నటికి దుర్భర అవస్థ!

అలనాటి నటికి దుర్భర అవస్థ!

వృద్ధాప్యంలో ఉన్న ఈ నటిని కొడుకు ఆస్పత్రిలో నిస్సహాయస్థితిలో వదిలేసి వెళ్లిపోయాడు.

‘పాకీజా’ వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన అలనాటి నటి గీతా కపూర్‌ దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. వృద్ధాప్యంలో ఉన్న ఆమెను కొడుకు ఆస్పత్రిలో నిస్సహాయస్థితిలో వదిలేసి వెళ్లిపోయాడు. మిడ్‌-డే కథనం ప్రకారం గీతాకపూర్‌ కొడుకు రాజా ఆమెను గత నెల ముంబై గోరేగావ్‌లోని ఎస్‌వీఆర్‌ ఆస్పత్రిలో చేర్పించాడు. ఆస్పత్రిలో కట్టేందుకు ఏటీఎం నుంచి డబ్బు తీసుకొస్తానంటూ చెప్పి వెళ్లిపోయిన అతను ఆ తర్వాత తిరిగి రాలేదు. అప్పటి నుంచి ఆమె ఆస్పత్రిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ఆమె పలు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించిందని తెలియడంతో ఆమె గురించి కథనాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.

తనను వదిలించుకోవాలని తన కొడుకు చూస్తున్నాడని, అందుకే తనను ఆస్పత్రిలో వదిలేసి పోయాడని ఆమె మీడియాకు తెలిపింది. ‘అతని చర్యలను తప్పుబట్టడంతో అతను నన్ను కొట్టేవాడు. నాలుగు రోజులకు ఒకసారే అన్నం పెట్టేవాడు. కొన్నిసార్లు నన్ను గదిలో పెట్టి బంధించాడు. నేను వృద్ధాశ్రమానికి వెళ్లేందుకు నిరాకరించడంతోనే ఇలా చేశాడు. అతడు ఉద్దేశపూర్వకంగా ఆకలితో మాడ్చి.. నేను అనారోగ్యానికి గురయ్యేలా చేశాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు’ అని ఆమె తెలిపింది.

కొడుకు రాజా ప్రస్తుతం తమ ఇంట్లో ఉండటం లేదని తెలుస్తోంది. గీతాకపూర్‌ను ఇంటికి తీసుకెళ్లాలని, ఆస్పత్రి ఫీజు లక్ష రూపాయలు చెల్లించాలని రాజాకు ఆస్పత్రి సిబ్బంది ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. గీతాకపూర్‌ కూతురు పూజ కూడా ఈ విషయంలో పట్టనట్టు దూరంగా ఉండటంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. గీతాకపూర్‌ కొడుకుపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement